ఈ విశ్వమంతా ఓ అద్భుతమైన, విచిత్రమైన సృష్టి. అందులో ఎన్నో వింతలు, విశేషాలు మనకు తెలిసినవి, తెలియనివి ఉన్నాయి. ఈ క్రమంలో సృష్టిలో ఉన్న ఒక్కో రహస్యాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఇంకా మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. అయితే జంతుజాలం విషయానికి వస్తే అందులోనూ మనకు లెక్కకు మించిన విచిత్రాలు ఎల్లప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి బల్లి. అవును, బల్లే. ఇంతకీ అందులో ఏం విషయం ఉందీ అంటారా..? అదే తెలుసుకుందాం రండి..!
బల్లి తోకను ఎప్పుడైనా గమనించారా..? ఆ… అదే. ఒక్కోసారి దాని తోక దానంతట అదే ఊడిపోతుంది. అలా ఎందుకు చేస్తుందంటే శత్రువుల దృష్టి మరల్చడానికి..! బల్లి తనను ఏదైనా మింగడానికి వస్తే ఆ జీవి దృష్టి మరల్చడానికి తన తోకను ఆటోమేటిక్‌గా ఊడిపోగొట్టుకుంటుంది. దీంతో దాన్ని చూసే ఇతర జీవుల దృష్టి మరలుతుంది. అదే సమయంలో బల్లి అదను చూసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తుంది. అయితే అలా బల్లి తన తోకను పోగొట్టుకున్నా అది మళ్లీ పెరుగుతుంది తెలుసా.? అవును, పెరుగుతుంది. అయితే అలా తోక మళ్లీ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లి జన్యువుల్లో శాటిలైట్ సెల్స్ అనబడే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి ఎంతో చురుగ్గా పనిచేస్తాయి. బల్లి తోక ఊడిపోగానే ఈ కణాలు అక్కడికి చేరుకుని డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేసే పనిలో పడతాయి. కొత్త కణజాలాన్ని తయారు చేయడం, ఇతర కణాలను తెచ్చి అక్కడ పెట్టడం వంటి పనులు చేస్తాయి. దీంతో కొన్ని రోజుల్లో బల్లి తోక మళ్లీ పెరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే అలా తోక పెరిగే క్రమంలో యువ బల్లులకైతే ఆలస్యమవుతుందట. ఎందుకంటే అటు శరీర పెరుగుదలకు, ఇటు తోక పెరుగుదలకు తగినంత శక్తి రాదట. అందుకే యువ బల్లుల్లో తోక పెరుగుదల ఆలస్యమవుతుంది. అయితే సాధారణ బల్లులకు ఇలాంటి బెడద లేదు. వాటి తోక త్వరగానే పెరుగుతుంది. కాకపోతే ఏ బల్లిలోనైనా ఊడిపోయిన తోక మళ్లీ పెరగాలంటే ఆ బల్లి మంచి పోషకాలతో కూడిన ఆహారం తినాలట. అదండీ, బల్లీ, దాని తోక సంగతి!
అయితే చివరిగా ఇంకో విషయం ఏమిటంటే… బల్లిలో ఉండే కొన్ని జన్యువులకు, మనిషి జన్యువులకు దగ్గరి సంబంధాలు ఉంటాయట. ఈ క్రమంలో బల్లి తోక పెరిగే విషయంపై సైంటిస్టులు పరిశోధనలు కూడా చేస్తున్నారు. వారి ప్రయోగాలు సఫలం అయితే అలాంటి జన్యువులను మనుషుల్లోనూ ప్రవేశపెడతారు. దీంతో మనుషుల్లో కోల్పోయిన అవయవాలు మళ్లీ పెరుగుతాయి. అదే జరిగితే… మరో కొత్త ప్రపంచం సృష్టి అయినట్టే..! అంతే కదా!