ప్రస్తుతం ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ముందంజలో ఉన్నారనడంలో సందేహం లేదు. కాని కార్యాలయాలు, ఇంట్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
ప్రధానంగా యువతుల్లో అందునా ఇటీవల వివాహమైన మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయని, వీరిలో మానసికమైన, శారీరకమైన ఒత్తిడి కారణంగానే వారు జబ్బులబారిన పడుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో పనిభారం పెరిగిపోవడంతో వారిలో మానసికమైన ఒత్తిడి దాదాపు 50 శాతం మేరకుంటోందని పరిశోధకులు తెలిపారు.
ప్రత్యేకించి పిల్లల భారం వహించే మహిళలలో అత్యధిక రిస్కు కనపడుతోంది. అటు గృహిణి భాధ్యతలు, ఆధునిక పోకడలు పోయే పిల్లల భాధ్యత, కార్యాలయాల్లో పని ఒత్తిడి అన్నీ కలిసి నేటి మహిళకు చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు.