ప్రస్తుతం మనం నిత్యం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించి ఎంతో కొంత చరిత్ర ఉంటుంది. అదెలా వచ్చిందీ, దాన్ని ఎవరు కనుక్కుందీ, ఎప్పటి నుంచి దాన్ని ప్రజలు వాడడం మొదలు పెట్టారు… ఇలా దాదాపుగా ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించిన ఆవిర్భావం, దాని కథా కమామీషు ఎంతో కొంత ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి వాటిలో చెప్పుకోదగింది గోడ గడియారం. అవును అదే. ఇంతకీ దాన్ని ఎవరు కనుక్కున్నారనేగా మీరు చెప్పబోయేది? అని అడగబోతున్నారా? అయితే మ్యాటర్ అది కాదు లెండి. ఎందుకంటే గోడ గడియారాన్ని ఎవరు కనుక్కున్నా ఇప్పుడు చెప్పబోతుంది వేరే. ఏమీ లేదు, గడియారంలో ముళ్లను మీరు ఎప్పుడైన గమనించారా? అవి ఎడమ వైపు నుంచి కుడికి తిరుగుతుంటాయి కదా, అసలు అవి అలాగే ఎందుకు తిరగాలి, కుడి నుంచి ఎడమకు ఎందుకు తిరగవు? అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదా? అయితే అవి అలా ఎందుకు తిరుగుతాయో ఇప్పుడు చూడండి…
భూమి ఉత్తరార్థ గోళంలో కుడి నుంచి ఎడమకు తిరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుడు ఇందుకు పూర్తిగా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాడు. అంటే ఎడమ నుంచి కుడికి అన్నమాట. ఈ క్రమంలోనే గడియారాలు అందుబాటులో లేని కాలంలో ఒకప్పుడు సన్ డయల్స్ వంటి వాటి ద్వారా సమయాన్ని కనుక్కునే వారు. సూర్యుడు తిరిగే దిశ (ఎడమ నుంచి కుడికి)ను బట్టి ఆనాటి కాలంలో సమయాన్ని లెక్కించే వారు. ఈ క్రమంలో అనంతరం వచ్చిన గడియారాలు కూడా అదే దిశను అనుసరించి తయారు చేయబడ్డాయి. అందుకే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు గడియారాల్లోని ముల్లులు సూర్యుని దిశలాగే ఎడమ నుంచి కుడికి తిరుగుతున్నాయి. అంతే తప్ప, ఇందులో వేరే ఏ ఇతర కారణమూ లేదు. ఒక వేళ భూమి దక్షిణార్థ గోళంలో తిరుగుతూ ఉన్నప్పుడు కనుక చూసి ఉంటే పైన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేక దిశలో అంతా జరిగేది. అప్పుడు సూర్యుని దిశ మారుతుంది కాబట్టి గడియారాలను కూడా అదే విధంగా తయారు చేసి ఉండే వారు. అంటే కుడి నుంచి ఎడమ వైపుకు ముల్లులు తిరిగే విధంగా ఉండేవి. ఈ క్రమంలో గడియారం ముళ్లు తిరిగే దిశకు క్లాక్ వైజ్ డైరెక్షన్ అనే పేరు కూడా వచ్చింది. దీనికి వ్యతిరేక దిశను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని వ్యవహరిస్తున్నారు.
కాగా కుడి నుంచి ఎడమ వైపుకు ముల్లులు తిరిగే విధంగా ఉండేలా పాలో ఉసెలో అనే వ్యక్తి ఓ గోడ గడియారాన్ని ఒకప్పుడు తయారు చేశాడట. ఆ దిశలో తిరిగే గడియారం ఇదొక్కటేనట. అందులో అతని చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ గడియారం ఇప్పటికీ భద్రంగా ఉందట. నిజంగా అలా వ్యతిరేక దిశలో ముల్లులు తిరిగే గడియారాన్ని చూస్తే చిత్రంగా ఉంటుందేమో కదా!