రోజంతా వ్యాయామం చేస్తూనే వుంటారు. కాని మీ బరువు పెరుగుతోందో లేదా తరుగుతోందో మీకే అంతుపట్టటం లేదు. అందుకుగాను బరువు పెరుగుతున్నామని తెలిపేందుకుగల నిదర్శనాలను కొన్నింటిని దిగువ ఇస్తున్నాం. పరిశీలించండి. ఒక్క ఫర్లాంగు దూరం నడకకు లేదా మెట్లు ఎక్కినపుడు అలసిపోతున్నారా? వ్యాయామం చేయకపోవటం కూడా అధిక బరువునిస్తుంది. అదనంగా వున్న కొవ్వు చర్మం కింద చేరి శరీరానికి ఒత్తిడినివ్వటం లేదంటే శరీర కిందిభాగమైన కాళ్ళకు నొప్పి కలిగించటం చేస్తుంది.
నడిచేటపుడు మీ తొడలు ఒకదానికొకటి తగులుతున్నాయా? సాధారణంగా కొవ్వు కణాలు పిరుదులవద్ద, తొడల వద్ద చేరతాయి. కనుక మీ తొడలు నడిచేటపుడు ఒకదాని కొకటి తగులుతున్నాయంటే ఖచ్చితంగా మీరు వెయిట్ పెరుగుతున్నారన్నమాటే. మీ ముఖం గుండ్రంగా తయారవుతోందా? లేక డబుల్ ఛిన్ వస్తోందా? బరువు పెరుగుతుంటే దాని మొదటి చిహ్నం ముఖంలో కనపడుతుందంటారు. ముఖం ఉబ్బినా లేక పాలిపోయినా, ఆ వ్యక్తికి కొవ్వు పేరుకుంటోందని చెప్పచ్చు. డబుల్ ఛిన్ కూడా వెయట్ పెరిగారనడానికి నిదర్శనమే. మహిళలు వెయిట్ పెరిగారనటానికి మరో నిదర్శనం వీపు భాగంలో కొవ్వు.
వీపు వెనుక పక్కలకు వేలాడే టైర్లు మహిళలు తమకిష్టమైన దుస్తులు కూడా ధరించకుండా చేస్తాయి. దుస్తులు టైట్ అయితే చాలామంది స్త్రీలు ఊపిరి కూడా తీసుకోలేరు. ముందుభాగంలో బటన్స్ కల షర్టులు వేసుకోవాలంటే అవి ఎపుడు ఊడతాయోనని భయపడుతూ వేసుకోవాల్సిందే. మీరు ఇష్టపడి కొనుక్క్కున్న జీన్స్ పేంట్ బటన్లు పట్టటం లేదంటే, పొట్టలో కొవ్వు పేరిందన్నమాటే. పొట్టలో చేరిన కొవ్వు పేంటు జిప్పులను లేదా బటన్లను పట్టనివ్వదు. వీరు కూర్చోవాలంటే చాలా కష్టంగా కూడా వుంటుంది. కనుక నేను లావెక్కానా? అని ప్రశ్నించుకుంటున్నారంటే… పైన చెప్పిన అంశాలు సరి చూసుకోండి. సమాధానం మీకే దొరుకుతుంది.