ఎన్నో వేల సంవత్సరాల నుంచీ ప్రపంచవ్యాప్తంగా నదులు మనుగడలో ఉన్నాయి. ఏ దేశంలో ఉన్న నదులు అయినా అక్కడి ప్రజల అవసరాలను తీర్చే జీవనదులుగా మారాయి. తాగునీటికే కాదు, సాగునీటికి ఇంకా అనేక ఇతర అవసరాలకు ఆయా నదులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులన్నింటిలో కొన్ని మాత్రం అత్యంత దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రమాదకర వ్యర్థాలతో కాలుష్యానికి ఆవాసాలుగా మారాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అవి రోజు రోజుకీ ఇంకా దీనావస్థకు చేరుకుంటున్నాయి. అయినా వాటిలోని నీటిని ఉపయోగిస్తూ జనాలు తీవ్ర అనారోగ్యాలకు గురవడమే కాదు, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. జనాలను అలా సమస్యల్లోకి నెట్టివేస్తున్న అలాంటి కాలుష్యపు నదులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హ్యాన్ రివర్… ఈ నది చైనాలో ఉంది. ఆ నది మొత్తం ఆల్గే విపరీతంగా పెరిగిపోయింది. అయినా ఆ నీటినే అక్కడి ప్రజలు వాడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆ నది పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ది సిటారం రివర్… ఈ నది ఇండోనేషియలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలుష్యంతో నిండిన నది ఇది. 50 లక్షల మంది ఈ నది నీటిని ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ నదిలో జరుగుతున్న కాలుష్యం వల్ల ఏటా 50వేల మంది చనిపోతున్నారు కూడా. అయినా అక్కడి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ది కుయహోగా రివర్… అమెరికాలోని క్లీవ్ ల్యాండ్‌లో ఈ నది ఉంది. 1969లో ఈ నదిపై ఉన్న రెండు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిలకు నిప్పు అంటుకుంది. దీంతో ఆ కాలుష్యమంతా నదిలోకి చేరి ఇప్పటికీ ఆ నది అలాగే ఉంది.
గంగా నది… మన దేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటిగా దీన్ని భావిస్తారు. హిందువులు ఈ నదిలో మునిగితే తమ పాపాలు తొలగిపోయి, పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. అందులో భాగంగానే వారు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ప్రస్తుతం ఈ నదిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అందులో స్నానం చేసే వారికి తీవ్ర అనారోగ్యాలు కలగమే కాదు, కొందరికైతే ప్రాణాంతక క్యాన్సర్ కూడా వస్తున్నదట. అయినా ప్రభుత్వాలు గంగా నది శుభ్రత గురించి నిర్లక్ష్యం వహిస్తూనే వస్తున్నాయి. హువాంగ్‌పు రివర్… ఈ నది కూడా చైనాలోనే ఉంది. షాంగై వాసులు ఈ నదిని నీటిని ఉపయోగిస్తున్నారు. అయితే 2013లో ఈ నదిలో చనిపోయిన 16వేల పందులను పడేశారట. దీంతో ఆ వ్యర్థాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయట. అయినా ఈ నది నీళ్లను ప్రజలు తాగుతూనే ఉన్నారు. రోగాల బారిన పడుతూనే ఉన్నారు.
ది జియాన్హె రివర్… చైనా దేశంలోనే ఈ నది ఉంది. చూసేందుకు ఈ నదిలో నీరు అచ్చం రక్తం లాగే ఉంటుంది. కానీ అది రక్తం కాదు. పక్కనే ఉన్న ఓ కెమికల్ ప్లాంట్ వారు ఇందులోకి ఎప్పటికప్పుడు వ్యర్థాలను డంప్ చేస్తుంటారు. అందువల్లే ఆ నది నీరు రక్తం రంగులో ఎర్రగా ఉంటుంది. మరిలావో రివర్… ఫిలిప్పీన్స్‌లో ఈ నది ఉంది. అత్యంత కాలుష్యభరితమైన నదిగా ఇది పేరు గాంచింది. అయినప్పటికీ దీని నీటిని 2.50 లక్షల మంది వాడుతూనే ఉన్నారు. రోగాల బారిన పడుతూనే ఉన్నారు. ది మటాంజా రియాచుయెలో రివర్… అర్జెంటీనాలో ఉన్న ఈ నదిలో కాలుష్యం స్థాయిలు ఏవిధంగా ఉన్నాయంటే… ఈ నదిలో 30 లక్షల టన్నుల వ్యర్థాలు ఉన్నట్టు గుర్తించారు. చెత్త, కెమికల్ పదార్థాలే ఇందులో ఎక్కువగా డంప్ చేస్తున్నారు. దగ్గర్లో ఉన్న ఎన్నో పెట్రోలియం కంపెనీలు ఇందులోకి వ్యర్థాలను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నాయి.
ది నైజర్ రివర్ డెల్టా… నైజీరియాలో ఉన్న ఈ నదిలో మొత్తం ఆయిల్ వ్యర్థాలే ఉంటాయి. అక్కడి ప్రభుత్వం నది పరిరక్షణగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పెట్రోలియం కంపెనీలకు ఆడింది ఆటగా మారింది. దీని వల్ల ఎన్నో లక్షల మంది జనాలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ది పసిగ్ రివర్… ఫిలిప్పీన్స్ లోనే ఈ నది కూడా ఉంది. ఈ నదిలో ఎంతగా వ్యర్థాలు పేరుకుపోయాయంటే నిజంగా రోత అనే పదం కూడా దీనికి వాడడం చాలా తక్కువే అవుతుంది. అన్ని వ్యర్థాలు ఈ నదిలో ఉంటాయి. రెడ్ రివర్… వెజ్‌ఝువోలో ఈ నది ఉంది. దీని నీరు అంతా రక్తం రంగులో ఎరుపుగా ఉంటుంది. అయితే అది వ్యర్థాల కారణంగా వచ్చింది. అయినా దాని నీటినే ప్రజలు తాగుతారు.
ది రివర్స్ ఆఫ్ రియో… బ్రెజిల్ లో ఈ నది ఉంది. ఇందులో ఉండే కొన్ని కోట్ల సంఖ్యలో జలచరాలు ఏటా చనిపోతున్నాయి. అందుకు ఇందులో ఏర్పడుతున్న కాలుష్యమే కారణం. యమునా నది… ఇక చివరిగా యమునా నది. మన దేశంలో గంగా నది తరువాత భక్తులు అత్యంత ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరించేది ఇందులోనే. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే అనేక చెత్త, వ్యర్థాలు, మురికి నీరు అంతా ఇందులోకి డంప్ అవుతోంది. ఫలితంగా ఈ నదిలో స్నానం చేసే వారికి ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి.