కూరగాయలు, పండ్లను పచ్చిగా తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కొన్నింటిని వండితే వాటిలోని పోషకాలు ఆవిరైపోతాయి, కాబట్టి అలాంటి ఆహారాన్ని పచ్చిగా తింటేనే పోషకాలు లభిస్తాయి. అయితే అన్ని ఆహారాలను అలా పచ్చిగా తినకూడదు. కేవలం కొన్ని మాత్రమే ఆ జాబితాకు చెందుతాయి కాబట్టి వాటినే పచ్చిగా తినాలి. మిగతా వాటిని కచ్చితంగా ఉడకబెట్టుకునే తినాలి. లేదంటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనమై వివిధ రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయట. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలో పచ్చిగా తినకూడని ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం. శనగలు, పెసలు, పల్లీలు తదితర గింజలను మొలకెత్తించి తినడం చాలా మందికి అలవాటు. కానీ వాటిని పచ్చిగా మాత్రం తినకూడదట. ఎందుకంటే వాటిలో సాల్మొనెల్లా అనే పేరు గల బాక్టీరియా ఎక్కువగా ఉంటుందట. ఇది మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుందట. దీంతో పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. కాబట్టి మొలకెత్తిన గింజలను ఉడకబెట్టి తినడమే బెటర్.
టమాటాలను కూడా పచ్చిగా తినకూడదు. ఉకడబెట్టి మాత్రమే తినాలి. లేదంటే వాటిలో ఉండే గ్లైకో ఆల్కలాయిడ్స్ కడుపులో అసిడిటీని పెంచుతాయి. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. చెమట కూడా దుర్వాసనతో వస్తుంది. ఆకుపచ్చని కూరగాయలను కూడా పచ్చిగా తినకూడదు. ఎంతో కొంత ఉడకబెట్టే తినాలి. లేదంటే వాటిలో ఉండే ఆగ్జాలిక్ యాసిడ్ మన శరీరానికి ఐరన్, కాల్షియం అందకుండా చేస్తుంది. పుట్ట గొడుగులలో కార్సినోజెనిక్ సమ్మేళనాలు ఉంటాయి. పచ్చిగా తింటే అవన్నీ మన శరీరంలోకి చేరి శరీరాన్ని విషతుల్యం చేస్తాయి. వీటిని కూడా ఉడికించే తినాలి.
పచ్చి బాదం పప్పులో సైనైడ్ ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి బాదం పప్పును తింటే వాపులు, నొప్పులు కలుగుతాయి. కొన్ని సార్లు క్యాన్సర్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వీటిని 8 నుంచి 12 గంటల పాటు నీటిలో నానబెట్టి తినాలి. పాలను పచ్చిగా తాగితే వాటిలో ఉండే బ్రసెల్లా లిస్టెరియా నేరుగా మన శరీరంలోకి వెళ్తుంది. ఇది డయేరియా, కడుపు నొప్పి, వాంతులు వంటి వ్యాధులను కలగజేస్తుంది. శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కాబట్టి పాలను మరిగించి మాత్రమే తాగాలి. పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి గుడ్లను ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో తినాలి. జీడిపప్పును అలాగే తింటే వాటిలో ఉండే ఉరుషియోల్ అనబడే టాక్సిన్లు శరీరంలోకి ప్రవేశించి స్కిన్ అలర్జీలను కలిగిస్తాయి. కడుపునొప్పి కూడా వస్తుంది. జీడిపప్పును నూనె లేకుండా పెనంపై కొద్దిగా వేయించి తీసుకోవాలి.
రాజ్మాలో లాక్టిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని విష తుల్యం చేస్తుంది. కనుక రాజ్మా గింజలను కూడా 5 గంటల పాటు నీటిలో నానబెట్టి అనంతరం ఉడకబెట్టి తినాలి. పచ్చి మాంసంలోనూ సాల్మొనెల్లా బాక్టీరియానే ఉంటుంది. ఇది డయేరియా, తలనొప్పి, జ్వరం వంటి వ్యాధులను కలగజేస్తుంది. కనుక మాంసాన్ని ఎల్లప్పుడూ ఉడికించే తినాలి. పచ్చిగా తినకూడదు.