విచిత్రమైన హెయిర్‌స్టైల్… తనదైన శైలిలో పలికించే హావ భావాలు… ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు… చిలిపి చేష్టలు… వెరసి మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు అధ్యక్షుడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. అధ్యక్ష ఎన్నికలేమోగానీ మొదట్నుంచీ ట్రంప్ వ్యాఖ్యలు, చేష్టలు వివాదాస్పదమే. వాటిని కొందరు సమర్థిస్తే, కొందరు తప్పు పట్టే వారు. అయినప్పటికీ అమెరికన్ల మద్దతుతో అధ్యక్ష పీఠం మళ్లీ ఎక్కాడు. అయితే ఇదంతా ట్రంప్ గురించి మనకు తెలిసిన ఓ వైపు మాత్రమే. అతని గురించి మనకు తెలియని ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిపై ప్రత్యేక కథనం…
డొనాల్డ్ జాన్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ సిటీలో జన్మించాడు. అతని తండ్రి పేరు ఫ్రెడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ చిన్నవాడు. ట్రంప్ అన్న ఫ్రెడ్ జూనియర్ మద్యం మత్తుకు బానిసై 1981లో మృతి చెందాడు. అతను కాక మిగిలిన వారందరూ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ట్రంప్ తండ్రిది జర్మనీ కాగా తల్లిది స్కాట్‌లాండ్. అతని కుటుంబ మూలాలు యూరప్‌కు చెందినవి. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని. కాగా ట్రంప్ 1968లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించాడు. అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనంతరం మూడేళ్లకు అంటే 1971లో తన తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీని ట్రంప్ టేకోవర్ చేసి ది ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చాడు. అప్పటి నుంచి ఆ రంగంలో ట్రంప్ అప్రతిహతంగా దూసుకెళ్తూ వచ్చాడు.
వింతైన చేష్టలతో ప్రస్తుతం మనకు కనిపించిన ట్రంప్ చిన్నప్పుడు అంత మంచి విద్యార్థి ఏమీ కాదు. చాలా అల్లరిగా ఉండేవాడు. ఓ రోజు స్కూల్ వారు కంప్లెయింట్ ఇవ్వడంతో ట్రంప్ తండ్రి అతన్ని మిలటరీ స్కూల్‌లో చేర్పించాడు. అయితే అక్కడ ట్రంప్ కెప్టెన్‌గా అర్హత సాధించి ఆశ్చర్యపరిచాడు. ట్రంప్ సోదరి మేరియన్నె ట్రంప్ బ్యారీ యూఎస్ఏ సర్క్యూట్ జడ్జ్. ఆమెను అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ నియమించాడు. ఆమె పార్టీ వేరైనప్పటికీ బిల్ క్లింటన్ అలా చేయడం గమనార్హం. అయితే దీన్ని ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్‌లో ప్రచారాస్త్రంగా మార్చుకున్నాడు. ఎలా అంటే క్లింటన్ ఎన్నికల ఖర్చుకు తాను డబ్బిచ్చానని, అందుకే తన సోదరికి ఆ పదవి ఇచ్చారని అన్నాడు.
ట్రంప్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందిన యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఒకటి కావడం విశేషం. ట్రంప్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు..ట్రంప్ ఆర్ట్ ఆఫ్ ది డీల్ పేరుతో రాసిన పుస్తకం బెస్ట్ సెల్లర్ బుక్ గా నిలిచింది. డొనాల్డ్ ట్రంప్‌కు తన రెండు కాళ్ల మడమలపై పుట్టుమచ్చలు ఉంటాయి. వాటిని ఆయన లక్‌మార్క్స్‌గా భావిస్తాడట. 1929లో అమెరికాలో నిర్మించిన ఓ పురాతన, చారిత్రక భవనాన్ని కూల్చివేసి 1983లో ట్రంప్ టవర్ పేరిట ఓ భవన నిర్మాణానికి పూనుకున్నారట. దీని వల్ల ట్రంప్ గురించి చాలా మందికి తెలిసిందట. అయితే ఆ భవన నిర్మాణం వివాదాస్పదమవడంతో దాన్ని నిలిపివేశారు. 2006లో ట్రంప్ స్కాట్‌లాండ్‌లో అత్యంత పెద్దదైన, విలాసవంతమైన ఓ లగ్జరీ గోల్ఫ్ కోర్స్‌ను నిర్మించదలిచాడట. ఆ సమయంలో స్థానికులు నిరసన తెలపడంతో అందులో వారికి 6వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడట. అయితే తీరా గోల్ఫ్ కోర్స్ నిర్మాణమయ్యాక కేవలం 200 మందికి మాత్రమే జాబ్‌లు ఇచ్చాడట. దీంతో స్థానికులు అతన్ని యు హావ్ బీన్ ట్రంప్డ్ అని పిలవడం మొదలు పెట్టారట.
డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కొన్నేళ్ల క్రితం ది అప్రెంటిస్ అనే వీడియో గేమ్‌ను విడుదల చేశారు. దాన్నే 2007లో ది అప్రెంటిస్: లాస్ ఏంజిల్స్ పేరిట మళ్లీ విడుదల చేశారు. 1980, 90లలో ట్రంప్‌కు వ్యాపార రంగంలో 3.5 బిలియన్ డాలర్లు, వ్యక్తిగతంగా 900 మిలియన్ డాలర్లు లాస్ వచ్చి అప్పులు మిగలడంతో 1995లో తన కంపెనీలు దివాళా తీశాయని ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. 2004, 2009లోనూ ట్రంప్ ఇదే విధంగా చేయడం గమనార్హం. 1980లో సౌదీ బిలియనీర్ 100 మిలియన్ డాలర్లతో తయారు చేయించుకున్న విలాసవంతమైన షిప్‌ను కేవలం 29 మిలియన్ డాలర్లకే ట్రంప్ 1998లో దొంగతనం చేసి సాధించాడట. అనంతరం దానికి ది ట్రంప్ ప్రిన్సెస్ అని పేరు పెట్టి మళ్లీ ఓ సౌదీ ధనికుడికే దాన్ని 40 మిలియన్ డాలర్లకు అంటే 11 మిలియన్ డాలర్ల లాభానికి అమ్ముకున్నాడట. ఆ షిప్‌లో 5 డెక్స్, ఒక డిస్కో, ఓ సినిమా థియేటర్, 2 డబుల్ బెడ్స్, 11 సూట్ రూమ్‌లు, ఒక హెలిప్యాడ్ వంటి సౌకర్యాలు ఉన్నాయట.
ట్రంప్ అనే బ్రాండ్ పేరుకు 3 బిలియన్ డాలర్ల విలువ ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. సక్సెస్ బై ట్రంప్ పేరిట అమెరికన్ మార్కెట్‌లో ట్రంప్‌కు చెందిన డియోడరెంట్ కూడా అందుబాటులో ఉంది. 2009 అనంతరం ట్రంప్‌కు బిజినెస్‌లో బాగా లాభాలు వచ్చి తన వ్యాపార శ్రేణిని మరింత విస్తరించారు. బుక్స్ పబ్లిషింగ్, మోడల్ మేనేజ్‌మెంట్ కంపెనీ, విటమిన్ సప్లిమెంట్ తయారీ, కాస్మొటిక్స్ వంటి అనేక కంపెనీలను ట్రంప్ స్థాపించి వాటిలో లాభాలతో దూసుకెళ్తున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ తెలుసుగా. అందులో మెక్‌మహోన్ అనే వ్యక్తితో ట్రంప్ పందెం కట్టి గెలిచాడట. దీంతో ఆ వ్యక్తికి ట్రంప్ మొత్తం షేవింగ్ చేయించాడట. ఇది 2013లో జరిగిన సంఘటన. ట్రంప్‌కు చెందిన మోడలింగ్ కంపెనీలో ప్రముఖ నటి ప్యారిస్ హిల్టన్ కూడా పనిచేసిందట. 2012 లెక్కల ప్రకారం ట్రంప్ ఆస్తి 1.4 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. అది ఇప్పటికి ఇంకా ఎన్ని రెట్లు పెరిగిందో.
ట్రంప్ హెయిర్ స్టైల్ చూశారుగా. చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే అందుకు కారణమేమిటంటే… ఉదయాన్నే ఆయన తన జుట్టును డ్రైయర్‌తో ముందుకు బ్లో చేసి అనంతరం దాన్ని వెనక్కి దువ్వుతారట. అందుకే జుట్టు అలా ఉంటుందట. ట్రంప్ ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. అందులో ఇద్దరు యూరప్ వారే. ఇవానా, మెలానీ, మార్లా మాపిల్స్ అతని భార్యలు. మెలానీ ఆయనకు ప్రస్తుతం భార్యగా ఉంది. ట్రంప్ కూతురు క్రిస్టియానిటీ నుంచి జుడాయిజంకు మారింది. కారణం ఆమె ఆ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే. 2015 నవంబర్‌లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ లైవ్ టీవీ షోను అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారట. 2013లో జరిగిన జస్టిన్ టింబర్‌లేక్, జిమ్మీ ఫాలన్ షో తరువాత ట్రంప్ షోకే ఎక్కువ టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయట. న్యాయపరమైన చిక్కులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ట్రంప్ సిద్ధహస్తుడట.
1973 నుంచి తనకు వ్యతిరేకంగా వచ్చిన 13 హై ప్రొఫైల్ లా సూట్లలో 6 సూట్లను సెటిల్ చేశాడట. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయట. వివిధ రంగాల్లో ట్రంప్‌కు 12 అవార్డులు కూడా వచ్చాయి. క్లింటన్ ఫౌండేషన్‌కు ట్రంప్ దాదాపు 2.50 లక్షల డాలర్లను ఇప్పటి వరకు ఇచ్చాడట. సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు ట్రంప్‌కు లేవట. కాకపోతే మహిళలతోనే కొంత చనువుగా ఉంటాడని తెలిసింది. ట్రంప్ మద్యం సేవించకున్నా తన పేరిట ఓ వోడ్కా బ్రాండ్‌ను 2006లో విడుదల చేశాడట. అయితే దానికి అంతగా సేల్స్ లేకపోవడంతో 2011 లో దాని తయారీని నిలిపివేశారట.