ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో వారి మనసులో కలిగే భావాలు ఎన్నో! ఈ దశలో వారి మనసులో కలిగే భయాన్ని, అపోహలను పోగొట్టి వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అయితే స్త్రీలలో రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ. పురాతన కాలం నుండి ఈ రుతు స్రావం గురించి అనేక నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. హిందూమతంలో రుతుక్రమం సమయంలో స్త్రీలు దేవాలయాలకు వెళ్ళకూడదని, పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదని ఆచారం. ఆ సమయంలో స్త్రీలు దేవాలయాలలోకి వెళ్తే అది అపవిత్రం అని, ఆలయం కూడా అపవిత్రం అవుతుందని హిందూ భక్తుల నమ్మకం.
రుతుచక్రం స్త్రీలలో నెల నెలా జరిగే ఒక రకమైన రక్తస్రావం. ఇది మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఇక రుతు చక్రాన్ని బహిష్టు, నెలసరి అని కూడా అంటారు. గర్భాశయంలోని ఎండోమెట్రీయం అనే లోపలి పొర ఒక నిర్దిష్టమైన కాలవ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్త్రావాన్ని రుతుస్రావం అంటారు. ఈ సమయంలో స్త్రీలు పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఇతర కుటుంబ సభ్యుల నుండి కూడా దూరంగా ఉండాలి. వంట గదిలోకి వెళ్లడం, కూరగాయలను ముట్టుకోవడం వరకు నియమాలు పాటించాలి. బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాల్సి ఉంటుంది. ఇది ఎప్పటినుండో వస్తున్న సాంప్రదాయం అని పెద్దలు చెప్తుంటారు.
మరొక విధంగా చెప్పాలంటే స్త్రీలు నెలసరి సమయంలో చాలా బలహీనంగా ఉంటారని, వారి నుండి ఐదు రోజులపాటు చెడు బ్యాక్టీరియా బయటకు వస్తుందని, అందువల్ల అన్నింటికి దూరంగా ఉండాలని ఆనాడు పెద్దలు చెప్పడం జరిగింది. అయితే గతంలో మహిళలకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. బహిష్టు సమయంలో స్నానం కూడా చేసేవారు కాదు. అందువల్ల గుడికి రావద్దని సూచించారు. కరోనా తో ప్రజలు ఎన్నో ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యి ఇంటికి పరిమితం అయ్యి, పరిశుభ్రంగా ఎలా ఉన్నారో.. అలాగే ఆ ఐదు రోజులపాటు బయటకు వెళ్లే చెడు బ్యాక్టీరియా నుంచి స్త్రీ కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసుకుని యధావిధిగా కొనసాగాలని చెబుతారు.