ఈడెన్ గార్డెన్స్ స్టేడియం లో ఒక్కసారిగా స్టేడియం అంతా నిశ్శబ్దం ఆవరించింది. సుమారు ఒక కోటి మంది ఉన్న ఆ స్టేడియంలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. కారణం ? అది క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ . ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతోంది. ఇండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కానీ అతను అవుట్ అయ్యాడు. చివరి బ్యాట్స్మెన్ గా రామశాస్త్రి ఆడటానికి వస్తున్నాడు. విరాట్ కోహ్లీ నీరసంగా అన్నాడు. గుడ్ లక్ బ్రదర్.. శాస్త్రి తల ఊపి క్రీజ్ దగ్గరకు వెళ్ళాడు. ఇండియా గెలవటానికి ఇంకా ఆరు పరుగులు కావాలి. కానీ ఒక్క బంతి మాత్రమే ఉంది. శాస్త్రి స్పిన్ బౌలర్ గా టీంలో ఆడుతున్నాడు. అతనికి పెద్దగా బ్యాటింగ్ రాదు. పాకిస్తాన్ తరపు అత్యంత వేగంగా బౌల్ చేసే షాహిన్ ఆఫ్రిది ఆ బంతిని వేయడానికి సిద్ధపడుతున్నాడు. కామెంట్రీ చెప్తున్న గవాస్కర్ కూడా ఇండియా గెలటం గెలవటం కష్టమని పాకిస్తాన్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాడు.
శాస్త్రి క్రేజ్ లోకి వచ్చాడు. గార్డ్ తీసుకున్నాడు. అతనికి భయంగా నర్వస్‌గా ఉన్నది. చేతులు వణుకుతున్నాయి . చెమట పడుతోంది . షహీన్ ఆఫ్రిది లాంటి ఫాస్ట్ బౌలర్ ని ఎదిరించి సిక్సర్ కొట్టే చాకచక్యత అతనికి లేదు. గొంతు ఎండిపోయినట్టుగా , నీరసంగా ఫీల్ అయ్యాడు. తను మెడలో వేసుకునే శ్రీకృష్ణుని లాకెట్ కళ్ళకు అద్దుకున్నాడు. అతనికి తండ్రి ఎప్పుడూ చదివే భగవద్గీత శ్లోకం గుర్తుకు వచ్చింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।।
శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు, చేయవలసిన కర్మలు మానరాదు. ఆ శ్లోకం గుర్తుకు రావడంతో మనసు ప్రశాంతంగా మారింది .అతను మనసులో అనుకున్నాడు నేను ప్రయత్నం చేయగలను అంతే. ఈ మ్యాచ్ గెలవడం ఓడటం నా చేతిలో లేదు . శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రయత్నం మాత్రమే నాది . ఈ భావన మనసులోకి వచ్చిన తక్షణం ఎంతో ఊరటగా ఫీల్ అయ్యాడు. కళ్ళలోని భయం తగ్గింది .చేతులు వణుకు తగ్గి స్టడీగా అయ్యాయి. ఒక్కసారిగా ధైర్యం వచ్చినట్టయింది. అతనికి ఇప్పుడు స్టేడియం, జనాలు, ఎవరు కనిపించడం లేదు. కేవలం బౌలర్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు .
పాకిస్తాన్ క్యాంప్లో కెప్టెన్ బౌలర్ కు వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు. విరాట్ కోహ్లీని ఎలాగో బౌల్డ్ చేశావో ఇతన్ని కూడా అలాగే బోల్డ్ చెయ్యి, కప్ మనదే అంటూ ప్రోత్సహించాడు .ఆ ప్రోత్సాహం తో ఫాస్ట్ బౌలర్ అఫ్రిది కి ఉత్సాహం వచ్చింది. మునుపటి బంతిలాగే వేగమైన యార్కర్ వేసి శాస్త్రి ని కూడా బౌల్డ్ చేస్తాను అని అనుకున్నాడు. బౌలింగ్ మార్క్ నుంచి కదిలి వేగంగా పరిగెత్త సాగాడు. స్టేడియంలో చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దం. ప్రేక్షకులందరూ ఊపిరి బిగుబట్టారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ,మిగతా అందరూ టీమ్ మెంబర్స్ నెర్వస్ గా చూస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు . శాస్త్రి మాత్రమే నిర్లిప్తంగా బంతి కోసం ఎదురు చూస్తున్నాడు. షహీన్ అఫ్రిది చాలా వేగంగా బౌల్ చేశాడు. యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ అదే అతడు చేసిన తప్పు. యార్కర్ వెయ్యబోయి ఫుల్ టాస్ వేశాడు. కూల్ గా ప్రశాంతంగా ఉండే శాస్త్రి నెమ్మదిగా బ్యాటును కదిపి లెఫ్ట్ సైడ్ బంతిని ఫ్లిక్ చేశాడు. 160 కిలోమీటర్ల వేగంతో షహీన్ ఆఫ్ డి వేసిన బంతి శాస్త్రి బాట్ కు తగులుతూనే పైకి లేచింది. లెగ్ సైడ్ ఉన్న ఇద్దరు ఫీల్డర్స్ అలర్ట్ అయ్యారు .కానీ ఆ బంతికి ఉన్న ఫోర్స్ కొద్ది ఆ బంతి బౌండరీ లైన్ దాటి ప్రేక్షకుల్లోకి వెళ్లి పడింది .
అంపైర్ రెండు చేతులు ఎత్తి సిక్సర్ ఘోషించాడు. కామెంట్రీ బాక్స్ లో రవి శాస్త్రి ఎక్సైటింగ్ గా అరుస్తున్నాడు .India has won the world cup అని . ప్రేక్షకులు పట్టలేని సంతోషంతో హర్షద్వానాలు చేస్తున్నారు .ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్స్ పరిగెత్తి వచ్చి శాస్త్రిని కౌగిలించుకొని సంతోషంతో నృత్యం చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం జరిగినది నమ్మలేక నిరాశగా చతికిలబడ్డారు. శాస్త్రి మాత్రం ప్రశాంతంగా నిర్లిప్తంగా ఉన్నాడు . తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో శాస్త్రిని అడిగారు ….ఈ విజయాన్ని మీరు ఎవరికి అర్పిస్తారు అని.. శాస్త్రి ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు నేను నా విజయాన్ని భగవద్గీతకు అంకితం చేస్తాను.. అన్నాడు.