High Sugar Levels : డయాబెటిస్ వ్యాధి ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. టైప్ 1, 2 డయాబెటిస్‌లతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వంశపారంపర్యంగా లేదా క్లోమగ్రంథి అసలు పనిచేయకపోవడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుండగా.. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, అధికంగా బరువు ఉండడం.. వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే టైప్ 1 కన్నా 2 తోనే ఎక్కువ మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా మన దేశం డయాబెటిస్‌కు రాజధానిగా మారుతుండడం నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది.
డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోకపోతే శరీరంలోని అన్ని అవయవాలు చెడిపోతాయి. కళ్లు పోయి అంధత్వం వస్తుంది. కాళ్లకు పుండ్లు పడి మానకపోతే కాళ్లను తొలగించాల్సి ఉంటుంది. కిడ్నీలు చెడిపోయి ప్రాణాంతకం అవుతుంది. లేదా హార్ట్ ఎటాక్‌లు రావచ్చు. కనుక డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్ ను కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో పలు లక్షణాలు సహజంగానే ప్రారంభం నుంచి కనిపిస్తాయి. అతి దాహం, అతిగా ఆకలి వేయడం, ఉన్నట్లుండి సడెన్ గా బరువు తగ్గిపోవడం, గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవడం, కంటి చూపు స్పష్టంగా లేక మసకగా కనిపిస్తుండడం, కండరాల ద్రవ్యరాశి కోల్పోవడం, తీవ్రమైన అలసట, తరచూ ఇన్‌ఫెక్షన్లు రావడం, రాత్రి పూట తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం.. వంటివన్నీ డయాబెటిస్ లక్షణాలు.
అయితే షుగర్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు అలాగే ఉంటే శరీరంలో తీవ్ర ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చేతులు బలహీనంగా మారిపోతాయి. అసలు చేతుల్లో శక్తి లేనట్లు అనిపిస్తుంది. ఏ పనినీ చేతుల్తో చేయలేరు. ముఖ్యంగా బరువును అస్సలు ఎత్తలేరు. శక్తి నశిస్తుంది. ముఖంపై పక్షవాతం వచ్చినట్లు ఏదైనా ఒక వైపు అసలు స్పర్శ అనేది ఉండదు. కళ్ల వెనుక భాగంలో నొప్పిగా ఉంటుంది. కొన్ని సార్లు దేన్ని చూసినా రెండుగా కనిపిస్తాయి. దేనిపై ఏకాగ్రత నిలపలేరు. సహనం కోల్పోతుంటారు. శరీరంలో షుగర్ మరీ అధికంగా ఉంటే కనిపించే లక్షణాలు ఇవి.
అయితే షుగర్ లెవల్స్ మరీ ఎక్కువైతే కంటి చూపును కోల్పోతారు. గుండె జబ్బులు వస్తాయి. హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. నోరు ఎల్లప్పుడూ పొడిగా ఉంటుంది. వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎల్లప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. షుగర్ మరీ ఎక్కువగా ఉంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయిన మేర డాక్టర్ సూచన మేరకు మందులను వాడుతూ డైట్ పాటించాలి. పిండి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తినాలి. దీంతోపాటు రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తేలికపాటి నడక అయినా చాలు, షుగర్ అదుపులోకి వస్తుంది. దీంతో తీవ్ర పరిణామాలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.