తలస్నానం చేస్తే శరీరానికి ఎలాంటి హాయి కలుగుతుందో మాటల్లో చెప్పలేం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రపోయే ముందు తలస్నానం చేస్తే చక్కని నిద్ర సొంతమవుతుంది. అయితే కొందరు మాత్రం తలస్నానం చేసేందుకు వెనుకాడుతారు. ముఖ్యంగా స్త్రీలు అయితే తలస్నానం చేసే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు తక్కువగా అవడం, శిరోజాలు కాంతిని కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వారు తలస్నానం చేసే విషయంలో కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తలస్నానానికి చాలా మంది వేడినీళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే అలా చేయరాదు. తలస్నానానికి కేవలం గోరు వెచ్చని లేదా చల్లని నీటిని మాత్రమే వాడాలి. ఎందుకంటే వేన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా పొడిగా మారుతాయి. కనుక వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది. దీని వల్ల షాంపూ, కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.
షాంపూతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి. షాంపూను తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. దీంతో షాంపూ, కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి. మనం అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు. శిరోజాలు సంరక్షింపబడతాయి. తలస్నానం వేగంగా చేయకూడదు. షాంపూ, కండిషనర్లు శుభ్రంగా పోయేదాకా జుట్టును కడగాలి. వెంట్రుకలను బాగా క్లీన్ చేయాలి. అప్పుడే వాటిల్లో దాగి ఉన్న దుమ్ము, ధూళి, క్రిములు పోతాయి. శిరోజాలకు సంరక్షణ చేకూరుతుంది. చాలామంది తలకు షాంపూను ఎక్కువగా రాసుకుంటారు. ఇలా చేయరాదు. ఎక్కువ షాంపూను వెంట్రుకలపై అప్లై చేస్తేనేగాని వెంట్రుకలపై షాంపూ సరిగా పనిచేయదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎక్కువ షాంపూ తలపై రాయడం వల్ల నురగ బాగా వస్తుంది, అంతే కానీ దాంతో కలిగే ప్రయోజనం సున్నా. కనుక నిర్దిష్టమైన మోతాదులో జుట్టును బట్టి షాంపూను తీసుకుని అప్లై చేసి తలస్నానం చేయాలి. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
కొందరు జుట్టుకు షాంపూలు కాక ఏ సబ్బు పడితే అది పెట్టి తలస్నానం చేస్తారు. అలా చేస్తే శిరోజాలకు సమస్యలు వస్తాయి. అవి త్వరగా రాలిపోతాయి. చుండ్రు సమస్య వస్తుంది. కనుక సబ్బుకు బదులుగా షాంపూ వాడితేనే మంచిది. లేదంటే కుంకుడు, శీకాయ రసాలను వాడవచ్చు. దీంతో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.