ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లే వారు కచ్చితంగా తమ వెంట రెజ్యూమ్ తీసుకెళ్తారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎవరైనా తమ రెజ్యూమ్‌లో తమ గురించిన అనేక విషయాలను రాస్తారు. వాటిలో చాలా ఉంటాయి. చదువు, ఇతర నైపుణ్యాలు, ఉద్యోగం చేసి ఉంటే ఆ పని వివరాలు, అనుభవం, వ్యక్తిగత హాబీలు, చిరునామా… ఇలా రెజ్యూమ్‌లో పెట్టే అంశాలు చాలానే ఉంటాయి. కానీ కొందరు రెజ్యూమ్‌ను క్రియేట్ చేసుకోవడంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. దీని వల్ల ఉద్యోగం ఇచ్చే వారికి అభ్యర్థిపై తప్పుడు ఇంప్రెషన్ పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే రెజ్యూమ్‌లో ఎవరైనా చేయకూడని మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రెజ్యూమ్‌లో అక్షర దోషాలు, వాక్య నిర్మాణంలో దోషాలు, తప్పుడు పదాలు, సంక్షిప్త అక్షరాలకు తప్పుడు వాక్యాలు లేకుండా చేసుకోవాలి. ఇవి బేసిక్ మిస్టేక్స్. వీటిలో పొరపాటు చేయరాదు. చేస్తే ఇంటర్వ్యూయర్ దృష్టిలో మీ స్థాయి పడిపోతుంది.
కొందరు అవసరం లేని సమాచారం కూడా పెట్టి ఎక్కువ పేజీలతో రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటారు. ఎక్కువ పేజీలు ఉంటే ఇంటర్వ్యూ చేసే వారికి మంచి ఇంప్రెషన్ కలుగుతుందని కొందరు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అవసరమైన సమాచారం మాత్రమే పెట్టి వీలైనంత వరకు చాలా తక్కువ పేజీలతో రెజ్యూమ్‌ను ప్రెజెంట్ చేయాలి. అప్పుడే ఇంటర్వ్యూయర్లు ఇంప్రెస్ అవుతారు. మీరు ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో దానికి చెందిన సమాచారం రెజ్యూమ్‌లో ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే ఇంటర్వ్యూయర్ మీ అప్లికేషన్‌కు ప్రాధాన్యతను ఇస్తారు. మీరు దరఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ కొన్ని ఉంటాయి కదా. అవి మీకు ఉన్నాయో లేదో రెజ్యూమ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తే మంచిది. ఫన్నీగా క్రియేట్ చేసుకున్న ఈ-మెయిల్ ఐడీలను రెజ్యూమ్‌లో పెట్టరాదు. మీపేరుతో ఉన్న ఈ-మెయిల్ ఐడీనే రెజ్యూమ్‌లో ఉంచాలి. అలాంటి మెయిల్ ఐడీ దొరక్కపోతే పేరుతోపాటు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేలా మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకుని దాన్ని రెజ్యూమ్‌లో పేర్కొనవచ్చు.
జాబ్‌లో జాయిన్ అయితే మీరు ఎలా పనిచేస్తారో అందుకు సంబంధించిన ఆబ్జెక్టివ్‌ను క్లియర్‌గా రెజ్యూమ్‌లో చెప్పండి. దీంతో ఇంటర్వ్యూయర్‌కు మీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. రెజ్యూమ్‌లో ఒక్కో విభాగాన్ని పరిమిత పదాలతో ముగించండి. చాట భారతం రాయకండి. వీలైనన్ని తక్కువ పదాలతో ఆయా భాగాల్లో వివరాలను పూర్తి చేయండి. గతంలో మీరు చేసిన జాబ్ ల గురించి చెప్పాలంటే భూత కాలంలో వాక్య నిర్మాణం చేయండి. అంతేకానీ వర్తమాన కాలంలో ఉండేలా వాక్యాలను నిర్మించకండి. మీ రెజ్యూమ్ అనేది మీ గురించే ఉంటుంది కానీ, ఇతరుల గురించి ఉండదు కదా. కనుక అందులో నేను అనే పదం వాడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ రెజ్యూమ్ మీ గురించే కాబట్టి ప్రత్యేకంగా నేను అనే పదాన్ని ఎక్కడా వాడాల్సిన పనిలేదు. మీకు తెలియని విషయాలను రెజ్యూమ్‌లో ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. పెడితే ఇంటర్వ్యూయర్లు ఆ అంశాల పట్ల ప్రశ్నలు అడిగితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.