కొంతమంది నటన మీద వ్యామోహంతో సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అన్నింటినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడితే, మరికొంతమందికి అనుకోకుండానే అవకాశం దక్కుతుంది. ఇంకొంతమందికి అసలు నటన అంటే ఏంటో తెలియకపోయినా అదృష్టం వరించి వారిని అందలం ఎక్కిస్తూ ఉంటుంది సినీ పరిశ్రమ. సరిగ్గా ఇలాంటి ఒక అదృష్టం ఒక వ్యక్తికి లభించింది. ఆ వ్యక్తి తనకు నటన అంటే ఏంటో తెలియదు అని, తాను నటనా రంగంలోకి రాను బాబోయ్ అంటూ మొత్తుకున్నా బలవంతంగా ఆయనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి, ఇప్పుడు ఆయనను స్టార్ సెలబ్రిటీగా మార్చేశారు. ఆయనే నిర్మాత, నటుడు కొల్లా అశోక్ కుమార్.
కొల్లా అశోక్ కుమార్ 1959, జూన్ 1న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భాగమైన చీరాల పట్టణంలో కొల్లా రామనాథం, వసుంధర దేవి దంపతులకు జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం కారంచేడు, చీరాలలో సాగింది. వ్యవసాయ, వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ఆయన చదువుకునే రోజుల్లోనే బిజినెస్ మీద ఆసక్తి కనబరచేవారు. అదే సమయంలో తమ బంధువులు సినిమా నిర్మాణంలో ఉండటంతో చీరాలలో సినిమా థియేటర్ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణించి నిర్మాతగా మారారు. నిర్మాతగా మొదట్లో పలు విజయవంతమైన చిత్రాలు తీసినప్పటికి, తర్వాత వరుస అపజయాలతో కొంత ఇబ్బంది పడ్డారు.
1990లో చెవిలో పువ్వు అనే సినిమాను నిర్మించే సమయంలో.. కొత్త వాళ్లతో టాలెంట్ ను గుర్తించి చూపించే దిగ్గజ డైరెక్టర్ కోడి రామకృష్ణ అశోక్ కుమార్‌ని చూసి.. నువ్వు నా చిత్రంలో నటిస్తావా? అని అడిగారట. దానికి అశోక్ కుమార్.. నేను నటించడం ఏంటి ..? అసలు నాకు నటనే తెలియదు? అయినా నేను ఇండస్ట్రీలో నిర్మాతగా ఉంటాను.. కానీ నటుడిగా మాత్రం కాదు.. అని చెప్పారట. దాంతో పట్టు వదలని కోడి రామకృష్ణ.. అసలు నువ్వేంటో నాకు తెలుసు.. నీకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలో కూడా నాకు తెలుసు.. ముందు నువ్వు ఒప్పుకో.. మిగతాదంతా నాకు వదిలేయ్ నేను చూసుకుంటాను.. అని తెలిపారట.
అలా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారత్ బంద్ సినిమాతో విలన్‌గా 1991లో ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత నటనకు ఆరేళ్లు విరామం ఇచ్చారు. అలా 1997లో ఒసేయ్ రాములమ్మ సినిమాలో విలన్ గా మెప్పించి, అదే ఏడాది 1997లో ప్రేమించుకుందాం రా, అంతఃపురం, ఆవారా గాడు, జయం మనదేరా, ఈశ్వర్ వంటి చిత్రాలలో నటించి 2002లో టక్కరి దొంగ అనే సినిమాలో చివరిగా నటించి , నటుడిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక నిర్మాతగా రక్త తిలకం, ధ్రువ నక్షత్రం, చెవిలో పువ్వు, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
నిర్మాతగా మారడానికి కారణం ఈయన మేనమామ స్వర్గీయ లెజెండ్రీ నిర్మాత రామానాయుడు గారికి మేనల్లుడు అవుతారు. ఇంతటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ పరపతి ఉపయోగించుకోలేదు. సొంతంగానే సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నం చేశారు. నటన రాదు మొర్రో అని మొత్తుకున్న అశోక్ కుమార్‌కి ఒసే రాములమ్మ సినిమా ఊహించని విజయాన్ని అందించింది. నిర్మాతగానే అప్పటి వరకు ఉన్న ఈయన ఒక్కసారిగా విలన్‌గా అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏది ఏమైనా అదృష్టం ఉండాలి కానీ అనుకోకపోయినా అందలం ఎక్కువచ్చు అని నిరూపించారు. ఒకవైపు నిర్మాతగా, మరొకవైపు నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించారు.