ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అప్పటికి ఎంత డబ్బు పోగేయగలిగితే హాయిగా రిటైర్ కాగలరు? ముప్పై ఏళ్ల తర్వాతి సంగతి (2050) మాట్లాడే ముందు ముప్పై ఏళ్ల క్రితం అంటే 1990 ల లో ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. గడచిన ముప్పై ఏళ్లలో ధరల పెరుగదల రేటు(ద్రవ్యోల్బణం- Inflation) 7.22% గా ఉంది. అంటే సుమారు అప్పటి రూ.100 విలువ నేడు సుమారుగా, అక్షరాల రూ. 1000. అంటే దాదాపు పది రెట్లు పెరిగింది గడిచిన ముప్పై ఏళ్లలో. 1990-2000లో సాధారణ ప్రభుత్వ ఉద్యోగి జీతభత్యాలు కూడా 2-3 వేలు వుండేవి. అంటే ఆ 2-3 వేలల్లో కుటుంబం, పిల్లలు, చదువులు అన్నీ గడిచిపోయేవి. అదే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి నేడు నెలకి 20-30 వేలు ఖర్చు అవుతుంది.
ఇదే రేటున చూస్తే నేడు 20-30 వేలు సరాసరి ఖర్చు అయ్యే కుటుంబానికి 2050 నాటికి 2-3 లక్షలు ఖర్చు అవ్వచ్చు. దేశ ఆర్థికాభివృద్ధి అధ్వాన్నం అయితే ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. నేడు పది వేలు ఉండే ఇంటి అద్దె 2050నాటికి లక్ష కావచ్చు. నేడు రూ. 1000 ఉన్న గ్యాసు, వంట నూనె (5kg) 2050 కి రూ.10000 కావచ్చు. ఉద్యోగుల ప్రారంభ జీత భత్యాలు కూడా లక్షకి తగ్గక పోవచ్చు. కానీ ఆ లక్ష కి నేడు ఉన్న విలువ 2050 లో ఉండదు. ఉద్యోగం చేరిన వెంటనే చాలా మంది పెళ్లి మొదలు, ఇల్లు, పిల్లలు, వారి చదువులు, వారి పెళ్లిళ్లు గురించి కూడా ప్లాన్ చేసుకుంటారు. కానీ 40-50 లు వచ్చాక కూడా రిటైర్మెంట్ గురించి అలోచన లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
హెల్త్ కేర్ లో పెరిగిన సాంకేతిక వల్ల 1990లో భారతదేశంలో, 57 సంత్సరాలు గా ఉన్న సగటు ఆయుర్దాయం (Life Expectancy), నేడు 70కి పెరిగింది. ఇది 2050 నాటికి 90-95కి పెరిగినా ఆశ్చర్యం లేదు. అంటే 60లో రిటైర్ అయితే ఆ తర్వాత మరో 25-30 యేళ్లు సగటు మనిషి సుదీర్ఘ జీవితం, రిటైర్మెంట్ సరిగా ప్లాన్ చేసుకోపోతే దుర్భరం అయ్యే అవకాశం వుంది. ఇక ఎంత మదుపు చేయాలన్నది మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ఖర్చులు, సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత పెద్దగా ఖర్చు ఉండదు అనుకుంటే పొరపాటు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఖాళీగా ఉంటేనే ఎక్కువ ఖర్చు పెడతారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఇంట్లో సరాసరి ఖర్చు ఎలా ఉంది, శని ఆది వారాల్లో ఎలా ఉందో పోల్చుకోండి. మీకే అర్థమవుతుంది. ఇవన్నీ దృష్టి లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి.