రజనీ కాంత్ కు మిగిలిన నటులకు వ్యత్యాసం వుంది. ఆయన ఇమేజ్ ని తలకెక్కించుకోలేదు. అభిమానులను ప్రేమగా చూస్తారు తప్ప, తనెలా మసలాలో మరొకరు నిర్ణయించే పరిస్థితికి తావు లేకుండా నడుచుకుంటున్నారు. తెరపై తన ఆహార్యం, నటన, సంభాషణలు వంటి విషయంలో తన అభిమానులకు ఎలా కావాలో గ్రహించి తదనుగుణంగా తన ఆకర్షణ తగ్గకుండా ప్రయత్నిస్తున్నారు. మరో విషయం ఈ జన్మ గురించి, ఈ శరీరం గురించి పూర్తి అవగాహన వున్న వ్యక్తి. అందుకే తరచు హిమాలయాలకు వెళ్ళి, కొన్నాళ్ళు ధ్యానం చేసి వస్తుంటారు. నిజానికి ఆయన బట్టతలతో తిరుగుతున్నారంటే, ఆయన భార్య, కుటుంబ సభ్యుల సహకారం కూడా కారణం.
మీ ఇమేజి దెబ్బతింటుంది. మేకప్, విగ్గుతోనే బయటకు వెళ్ళండి.. అని ఒత్తిడి చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్రస్తుతం ఆయినా ఓ మంచి విషయం చెప్పాలి. తను నటించిన చిత్రానికి నష్టాలొస్తే, తాను తీసుకున్న పారితోషికం తిరిగి నిర్మాతకు ఇస్తారట. సమకాలికులైన కథానాయకులు మేకప్, విగ్గులతో బయటకు వెళ్తున్నారు అంటే ఇమేజ్ దెబ్బతింటుందని కావచ్చు. వ్యక్తి గతంగా వయస్సు తెలిసిపోతుందనే భయం కావచ్చు.
అసలు మానవ నైజం ఒకటుంది. చిన్నతనంలో పెద్దవారిలా కనపడాలని అనిపిస్తుంది. అందుకే ఆడపిల్లలు చిన్నతనంలో ఓణీలు, చీరలు ధరించి బువ్వాలాటలు ఆడతారు. మగవారు పెద్ద వయసులో యువతలా కనపడాలని తాపత్రయ పడతారు. జుట్టుకు రంగు వేస్తారు. జీన్ దుస్తులు ధరిస్తారు. ఇంకా మేకప్ లు చేసుకుంటారు. మహిళలు కూడా ఎన్నో విధాల యువతుల్లా కనపడేందుకు ప్రయత్నిస్తారు.