టీవీ… ఎక్కడో జరిగిన సంఘటనలకు చెందిన వీడియోలను, ఆ మాటకొస్తే లైవ్ సంఘటనలను కూడా దూరంలో ఉన్న మనకు చూపే సాధనం. కాలక్రమేణా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, గేమింగ్ కన్సోల్స్ దాని స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలు టీవీలే కాదు, ఆయా డిజిటల్ మాధ్యమాలపై నిత్యం గంటల సమయం పాటు గడుపుతున్నారు. అయితే అలా పిల్లలు డిజిటల్ తెరలను చూస్తూ రోజుకు 3 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు వాటిపై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందట. వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుందట. ఇది మేం చెబుతోంది కాదు. లండన్ సైంటిస్టులు చేసిన పరిశోధనల సారాంశం..!
యూనివర్సిటీ ఆఫ్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అక్కడి బర్మింగ్‌హామ్, లీసెస్టర్ సిటీల్లో ఉన్న 200 స్కూళ్లలో చదువుతున్న 9 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల 4500 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఆ పిల్లల అలవాట్లు, తీసుకునే ఆహారం, జీవన విధానం వంటి అన్ని అంశాలను రికార్డు చేశారు.
చివరికి తెలిసిందేమిటంటే… రోజూ 3 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం పాటు టీవీ లేదా కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి డిజిటల్ స్క్రీన్‌లపై గడుపుతున్న పిల్లల మెటబాలిక్ రేట్, బరువు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నిర్దారించారు. ఈ క్రమంలో ఆకలి, గ్లూకోజ్, ఇన్సులిన్‌లను నియంత్రించే లెప్టిన్ అనే హార్మోనుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దీంతో అధిక బరువు సమస్య, టైప్ 2 డయాబెటిస్ వస్తాయని పేర్కొన్నారు. చూశారుగా… డిజిటల్ మాధ్యమాల వల్ల పిల్లల ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుందో. కనుక మీ పిల్లలు గనక రోజూ 3 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నా లేదంటే కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి వాటిపై గడుపుతున్నా వెంటనే ఆ అలవాటు మాన్పించేయండి. లేదంటే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు అనేక రకాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. కనుక వ్యాధి వచ్చిన తరువాత బాధ పడడం కన్నా నివారణే ఉత్తమ మార్గం.