ఎమర్జెన్సీ సమయంలో అంటే ఏమో గానీ… చాలా మంది తమకు బాత్‌రూం అందుబాటులో ఉన్నా ఒక్కోసారి కాలకృత్యాలను తీర్చుకోకుండా మలాన్ని అలాగే ఆపి ఉంచుతారు. చాలా ఎక్కువ సేపు దాన్ని అలాగే బలవంతంగా అదిమి పెట్టి మరీ ఉంటారు. అయితే నిజానికి ఇలా చేయడం చాలా ప్రమాదకరమట. మలం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయట. దీని గురించి వైద్యులు చెబుతున్నదేమిటంటే… ఎక్కువ సేపు మలాన్ని ఆపి ఉంచితే దాంతో శరీరంలో మలం అలాగే ఉండి అది మలబద్దకం, పైల్స్ వంటి ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇంకా వారు ఏమంటున్నారంటే… ఎక్కువ సేపు మలాన్ని ఆపి ఉంచడం వల్ల పేగుల్లో ఉన్న మలం కాస్తా ఎండిపోయి డ్రైగా మారుతుందట. దీంతో మళ్లీ మల విసర్జన చేసినప్పుడు చాలా నొప్పి కలుగుతుందట. దీంతోపాటు మంటగా కూడా ఉంటుందట.
మలం ఎక్కువ సేపు ఆపి ఉంచడం వల్ల పేగులు వాపుకు గురవుతాయి. దీంతో అంతర్గతంగా లేదా బాహ్యంగా హెమరాయిడ్స్ వస్తాయి. వాటిని పైల్స్ అని కూడా అంటారు. అవి గనక వస్తే ఓ పట్టాన తగ్గవు. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మల విసర్జన చేసినప్పుడల్లా నరకం కనిపిస్తుంది. మలం బయటకు వెళ్లేందుకు అనువుగా దాంతోపాటు కొంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే మనం మలాన్ని ఎక్కువ సేపు ఆపి ఉంచితే గనక అదే నీటిని శరీరం మళ్లీ శోషించుకుంటుంది. దీంతో ఆ నీటిలో ఉండే విష పదార్థాలు రక్తంలో చేరతాయి. అప్పుడు ఇతర అనారోగ్యాలు సంభవించేందుకు అవకాశం ఉంటుంది. మలాన్ని ఎక్కువ సేపు ఆపి ఉంచితే కలిగే అనర్థాల్లో మలబద్దకం కూడా ఒకటి. ఎప్పుడూ మల విసర్జన సరిగ్గా అవదు. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అప్పుడు మన శరీరం ఓ డస్ట్‌బిన్‌లా మారుతుంది. దీంతో అనేక వ్యాధులు వస్తాయి.
ఎక్కువ సేపు మలాన్ని ఆపి ఉంచితే గ్యాస్ ఉత్పన్నమవుతుంది. అది పేగుల లోపలి పొరలను గణనీయంగా దెబ్బ తీస్తుంది. దీంతో అల్సర్స్ వంటివి వస్తాయి. మలం ఆపి ఉంచితే సోమరిగా, మజ్జుగా ఉంటారట. అస్సలు పని మీద ధ్యాసే ఉండదట. ఈ క్రమంలో అలాంటి వారు ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటారట. కనుక వీలైనంత వరకు మలాన్ని అదిమిపెట్టే ప్రయత్నం చేయకండి. ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు నిరభ్యంతరంగా వెళ్లి రండి..!