గుండె అనేది ఒక కండరం. ఇరవై నాల్గు గంటలూ ఇది సంకోచ వ్యాకోచాలకు లోనవుతూనే వుంటుంది. గుండె లేదా హృదయం మన భావాలను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకించి ప్రేమ, భక్తి శ్రధ్ధ అనేవి హృదయంనుండే పుట్టుకు వస్తాయి. శరీరంలోని వివిధ భాగాలకు తన సంకోచ వ్యాకోచాల ద్వారా ఆక్సిజన్, పోషకాహారాలు కల రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె కండరాలకు రక్తం వివిధ రక్తనాళాల ద్వారా చేరుతుంది. గుండె కు అడ్డంకి ఏర్పడటమంటే, వివిధ రక్తనాళాలకు రక్త సరఫరా తగ్గిపోవడం. దీనినే కరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు.
దీని లక్షణాలు, ఛాతీలో నొప్పి , గుండె పోటు, గుండెకు రక్త సరఫరా తగ్గి ఆకస్మిక మరణం సంభవించడం జరుగుతుంది. ఒకనాడు ఈ వ్యాధులు ధనిక దేశాలలో వారికి వచ్చేవి. నేడు మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచంలోని ప్రతి దేశంలోను సంభవిస్తూనే వున్నాయి. భారతీయులలో 30 లేదా 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే చాలు గుండెపోటు మరణాలు సంభవించటం, గుండె సంబంధిత వ్యాధులు రావటం జరుగుతోంది.
గుండెపోటు మరణాలు అన్ని వయసులవారిలో వున్నప్పటికి, ప్రత్యేకించి మనదేశ యువకులలో కూడా గుండెపోటు మరణాలు అధికమవుతున్నాయి. మనదేశంలో స్ధానికంగా వున్న వారికంటే కూడా ఇతర దేశాలనుండి మనదేశంలోకి వచ్చిన జనాభాకు ఈ సమస్య 3 రెట్లు అధికంగా వుంటోందని పరిశోధనలు తెలుపుతున్నాయి.