ఫోన్ లాక్, అన్‌లాక్..! స్మార్ట్‌ఫోన్ యూజర్లను తరచూ కన్‌ఫ్యూజింగ్‌కు గురిచేసే పదం ఇది. సాధారణంగా మనం ఆండ్రాయిడ్, ఐఫోన్… ఇలా ఏ స్మార్ట్‌ఫోన్‌ను అయినా పిన్, ప్యాట్రన్ లేదా పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్ వంటి పద్ధతుల్లో లాక్ చేసుకుంటాము కదా..! మరి ఆ లాకింగ్ కాదా..! అంటే.. అవును.. ఇప్పుడు మేం చెప్పబోయేది ఆ లాకింగ్ కాదు. నెట్‌వర్క్ లాక్..! ఇంతకీ నెట్‌వర్క్ లాక్ అంటే ఏమిటి..? దాని వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..?
నెట్‌వర్క్ లాక్ అంటే ఏమీ లేదండీ..! ఐఫోన్, గూగుల్ పిక్సల్ లాంటి హై రేంజ్ ఫోన్లు ఉంటాయి కదా..! వాటిని ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయలేని వారు నెలవారీ పద్ధతుల్లో ఏదైనా టెలికాం ఆపరేటర్ నుంచి కొనుగోలు చేస్తారన్నమాట. ఫారిన్‌లో అయితే వెరిజాన్ అని, స్ప్రింట్ అని, ఏటీ అండ్ టీ అని పలు రకాల టెలికాం కంపెనీలు ఉన్నాయి. అదే మన దేశంలో అయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో అన్నమాట. ఈ నెట్‌వర్క్ ఆపరేటర్ల నుంచి యూజర్లు ముందు చెప్పిన విధంగా ఫోన్లను కొనుగోలు చేస్తే అప్పుడు ఆయా ఫోన్లు ఆయా నెట్‌వర్క్‌లకు లాక్ అవుతాయి. అంటే… వాటిల్లో అదే నెట్‌వర్క్ సిమ్‌లు మాత్రమే పనిచేస్తాయి. వేరే నెట్ వర్క్ సిమ్‌లు పనిచేయవు. అప్పుడు అలాంటి ఫోన్లను లాక్ అయిన ఫోన్లని పిలుస్తారు.
ఈ క్రమంలో అలా లాక్ అయిన ఫోన్లను అంత సాధారణంగా అన్‌లాక్ చేయలేం. అందుకు సంబంధించిన అన్‌లాకింగ్ సాఫ్ట్‌వేర్ సదరు నెట్ వర్క్ కంపెనీల వద్దే ఉంటుంది. ఆయా ఫోన్లకు గాను యూజర్లు చెల్లించే నెలవారీ మొత్తం గడువు ముగిశాకే టెలికాం ఆపరేటర్లు ఆ ఫోన్లలో నెట్‌వర్క్ అన్‌లాక్ చేస్తారు. అప్పుడే ఇతర నెట్‌వర్క్‌ల సిమ్‌లను వేసుకునేందుకు వీలవుతుంది. అంతేకానీ… ఓ నెట్‌వర్క్ లాక్ అయి ఉన్న ఫోన్‌ను మరో నెట్‌వర్క్ సిమ్‌తో వాడుకోలేం. అలా అని చెప్పి లాక్ అయిన నెట్‌వర్క్‌ను మనం ఓపెన్ చేయనూ లేం. కానీ కొందరు మొబైల్ షాప్స్ వారు ఇలాంటి లాక్స్‌ను తెరుస్తారని తెలిసింది. అయితే ఒకవేళ ఎవరైనా యూజర్ పెండింగ్‌లో ఉన్న సదరు నెలవారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినా, లేదంటే వేరే దేశానికి వెళ్తున్నా నెట్‌వర్క్ ఆపరేటర్‌ను కలిసి ఫోన్‌ను అన్‌లాకింగ్ చేయించుకోవచ్చు. అలా ఫోన్ అన్‌లాక్ వీలువుతుంది. ఇప్పుడు తెలిసిందా..! నెట్‌వర్క్ ఫోన్ లాక్ అంటే ఏమిటో..!