Khiladi Movie : మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. రవితేజ మాస్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మరోమారు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ మూవీ తాజాగా లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ మూవీ టైటిల్ తనదని చెబుతూ బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ కోర్టుకెక్కారు.

1992లో అక్షయ్ కుమార్ హీరోగా రతన్ జైన్ అప్పట్లో ఖిలాడి పేరిట సినిమా తీశారు. అయితే ఈ మూవీ టైటిల్ ను తాను రిజిస్టర్ చేశానని రతన్ జైన్ తెలిపారు. తన అనుమతి లేకుండా రవితేజ సినిమాకు ఆ టైటిల్‌ను వాడుకున్నారని అన్నారు. అయితే ఆయన కోర్టులో కేసు వేసే సమయానికే సినిమా రిలీజ్ అయిపోయింది. తనకు సినిమా రిలీజ్ అయ్యే విషయం ఆలస్యంగా తెలిసిందని, కనుక ఆలస్యంగా కేసు వేశానని రతన్ జైన్ తెలిపారు.
అయితే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది కనుక ఇప్పుడు ఏమీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఈ మూవీ ఓటీటీలోనూ విడుదలవుతుంది కనుక దాన్నయినా ఆపాలని ఆయన కోరారు. దీంతో కోర్టు ఆయన విజ్ఞప్తిని పరిశీలిస్తోంది. ఇక తనకు టైటిల్ కోసం ఎలాంటి డబ్బు అక్కర్లేదని, ఖిలాడి టైటిల్‌కు ఒక మంచి గుర్తింపు ఉందని, దాన్ని కాపాడుకోవడం కోసమే ఇలా కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని.. ఆయన తెలిపారు. మరి ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.
ఇక ఈ వివాదంపై ఖిలాడి చిత్ర యూనిట్ స్పందించలేదు. కానీ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.