ఇండియాలో ఐఫోన్లను ఫాక్స్‌కాన్స్ అనే సంస్థకు చెందిన పరిశ్రమలో తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే చైనా నుంచి 300 మంది ఇంజినీర్లను ఈ సంస్థ రప్పించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ ఇంజినీర్లను చైనా వెనక్కి పిలిపించుకుంది. కానీ ఫాక్స్‌కాన్ పట్టుబట్టి మరీ ఆ 300 మంది చైనా ఇంజినీర్లు భారత్‌కు వచ్చి తమ పరిశ్రమలో పనిచేసేలా చేసింది. అయితే దీని సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. భారత్‌లో ఎంతో మంది నిపుణులైన ఇంజినీర్లు ఉన్నారని అలాంటప్పుడు చైనా నుంచి వారిని రప్పించుకోవడం ఎందుకని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ఈ విషయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ ఇది కేవలం తాత్కాలికమేనని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పింది. అయితే వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ డీల్స్ కారణంగా చాలా కంపెనీలు చైనాను వదిలి భారత్‌లో తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. అందులో టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ కూడా ఒకటి. రానున్న రోజుల్లో చైనాను వదిలి పూర్తిగా భారత్‌లోనూ యాపిల్ తన ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేయాలని చూస్తోంది. ఇందుకు గాను భారీ ఎత్తున కార్మికులు, ఇంజినీర్లు అవసరం అవుతారు. దీని వల్ల భారత యువతకు పుష్కలంగా అవకాశాలు లభించనున్నాయి. అయితే ఇక్కడి కంపెనీలు మాత్రం చైనా నుంచి కార్మికులను, ఇంజినీర్లను దిగుమతి చేసుకోవడం చాలా మందికి నచ్చడం లేదు.
వాస్తవానికి నైపుణ్యం కలిగిన యువత, ఇంజినీర్లు భారత్‌లోనే సమృద్ధిగానే ఉన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల మన యువతకు సరైన ఉద్యోగావకాశాలు లభించడం లేదని నిపుణులు అంటున్నారు. యువతకు సరైన శిక్షణ కల్పించి స్కిల్స్ నేర్పిస్తే ఇక్కడి కంపెనీలు చైనా మ్యాన్ పవర్‌పై ఆధార పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత కూడా అభివృద్ధి చెందుతున్న రంగాలను ఎంచుకుని తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే ఉద్యోగాలకు కొదువ లేదని చెబుతున్నారు. మరి మన యువత ఇలా చేస్తారో లేదో చూడాలి.