సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని విషయాలను కూడా ఎంతో గట్టిగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే వేళకాని వేళలో కొన్ని పనులు చేయటం వల్ల మనకు అష్ట దరిద్రం తలెత్తుతుందని తెలిస్తే పొరపాటున కూడా ఆ పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ కొందరు ఇలాంటి పట్టింపులు ఏవి పట్టించుకోకుండా వారి రోజువారి పనులను చేస్తుంటారు.కానీ మన ఆచార వ్యవహారాల ప్రకారం సంధ్యాసమయంలో కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి సాయంత్రం సమయంలో చేయకూడని పనులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.
సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురతో చెత్త ఊడ్చకూడదని పెద్దవారు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలపై పోట్లాటకు వెళ్ళకూడదు, వారితో గొడవలు పడి వారిని అవమానించకూడదు. ఇలా ఆడవారిపై కోప్పడ్డం వల్ల అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ఇంటి నుంచి వెళ్లి పోతుందని పండితులు చెబుతున్నారు.
చాలామందికి సంధ్యా సమయంలో నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం పరమ దరిద్రం. ఇలా నిద్రపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక హిందువులందరికీ ఎంతో పవిత్రంగా భావించి తులసి మొక్కకు సాయంత్రం సమయంలో నీటిని పోయకూడదు. నీరు పోయడం వల్ల అమ్మవారి ఎంతో ఆగ్రహం చెందుతారు. సంధ్యాసమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి తులసి చెట్టు కింద కూర్చుని ఉంటారు కనుక తులసి చెట్టుకు సంధ్యాసమయంలో నీరు పోయకూడదు.