ప్రతి ఏడాది చాలా మంది ఘనంగా జరుపుకునే పండగలలో సంక్రాంతి కూడా ఒకటి. దసరా లాగే సంక్రాంతిని కూడా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే సంక్రాంతి సమయంలో వాస్తవానికి మన పెద్దలను పూజించుకుంటే ఎంతో మేలు జరుగుతుందట. సంక్రాంతి సమయంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనపై మన పితృదేవతల ఆశీస్సులు ఉంటాయట. కనుక సంక్రాంతి సమయంలో కొన్ని కార్యక్రమాలను చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఆ కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనంలో పితృదేవతలు మన దగ్గరకి వస్తారట. ఉత్తరాయనం కాగానే వెళ్లిపోతారట. అంటే సంక్రాంతి సమయంలో అన్నమాట. అయితే అదే సమయంలో పితృదేవతలకు పూజలు, వాళ్ల పేరిట దానాలు చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందట. సంక్రాంతి సమయంలో వచ్చే కనుమ నాడు పూర్వీకులను పూజించాలి. వారి పేరిట దానాలను చేయాలి. తర్పణాలను కూడా వదలాలి. వీటిని ఎవరంటే వారు చేయవచ్చు. కానీ పిండాలను మాత్రం ఇంట్లో కుమారులు పెట్టాలి. పెద్ద కుమారుడు లేదా చిన్న కుమారుడు చేయాల్సి ఉంటుంది. ఇద్దరూ అందుబాటులో లేకపోతే వారి పేరు చెప్పి ఇతరులు ఎవరైనా పిండాలను పెట్టవచ్చు.
ఇక సంక్రాంతి సమయంలో దానాలు చేస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా పేదలు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయి. సంక్రాంతి సమయంలో వెళ్లిపోయే పితృ దేవతలకు ఇలా చేయడం వల్ల వారు మనల్ని గుర్తుంచుకుంటారట. మనం ఏం చేసినా కలసి వచ్చేలా అనుగ్రహిస్తారట. కనుక సంక్రాంతి సమయంలో పితృదేవతలను పూజించడం మరిచిపోకండి.