Cremation : ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాలకు చెందిన ప్రజలు తమ వర్గ ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మతాన్ని తీసుకున్నా అందులో తమ వర్గం వ్యక్తి చనిపోతే పూడ్చడమో, కాల్చడమో చేస్తారు. వారి పద్ధతులను పాటిస్తూ ఆ కార్యక్రమం చేస్తారు. ఇక హిందూ మతంలో అయితే చనిపోయిన వ్యక్తులను దహనం చేస్తారు. మరి అలా ఎందుకు దహనం చేస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న కారణాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
బతికి ఉన్నప్పుడు మనిషి తెలిసో తెలియకో ఎంతో కొంత పాపం చేస్తాడు కదా. ఇక కొందరైతే నిరంతరం పాపాలు చేస్తూనే పోతారు. అయితే ఎవరైనా చనిపోతే హిందూ మతంలో మాత్రం వారిని ఆచారం ప్రకారం దహనం చేస్తారు. అలా అగ్నిలో వేసి దహనం చేయడం వల్ల అతనికి ఉండే మరుసటి జన్మలోనైనా అతను పాపాలు చేయకుండా పరిశుద్ధుడై జీవిస్తాడట. అందుకే హిందూ మతంలో చనిపోయిన వారిని దహనం చేస్తారు. ఇక ఇందుకు గల మరో కారణం ఏమిటంటే..
చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఆత్మ అలాగే అంటి పెట్టుకుని ఉంటుంది. ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్లాలంటే దాన్ని దహనం చేయాలి. అలా చేస్తేనే శరీరం నుంచి ఆత్మ విడిపోయి మరొక దేహాన్ని చూసుకుంటుంది. దహనం చేయనంత వరకు ఆత్మ అలాగే తిరుగుతూ ఉంటుందట. కనుకనే దహనం చేస్తారు. ఇక ఎవరిని దహనం చేసినా నీటి ప్రవాహం ఉన్న నదులు, చెరువుల వద్దే ఆ పనిచేస్తారు. దీంతో ఆత్మ పరిశుద్ధమవుతుందని నమ్ముతారు.
ఈ క్రమంలో దహనం చేశాక వచ్చే బూడిదను నీటిలో కలుపుతారు. అలా కలపడం వల్ల ఆత్మ పంచ భూతాలలో కలుస్తుందని అంటారు. అనంతరం 13వ రోజున పిండ ప్రదానం చేస్తారు. దీంతో ఆత్మకు విముక్తి కలిగి మరొక దేహం లోకి వెళ్తుందట. ఈ మొత్తం ప్రక్రియను హిందువులు అంతిమ సంస్కారం అని వ్యవహరిస్తారు. ఒక మనిషికి తన జీవిత కాలంలో జరిగే సంస్కారాల్లో ఇదే ఆఖరుది.