మనందరమూ కూడా గుడికి వెళ్ళినప్పుడు చాంతాడంత క్యూ లైన్లో నిల్చుని ఒకరినొకరు తోసుకుంటూ అక్కడ జరిగే అభిషేకం చూడటానికి పోటీ పడతాము కదా.కానీ అసలు అభిషేకం ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా??ఈరోజు ఈ ఆర్టికిల్‌లో మేము వివిధ రకాల అభిషేకాలు, అవి ఎందుకు చేస్తారో కారణాలూ ఇచ్చాము చూడండి. గుడిలో విగ్రహన్ని నల్లరాయి లేదా తెల్లని పాలరాతితో చెక్కుతారు. విగ్రహనికి ఒక రూపు వచ్చాకా శూభముహుర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ విగ్రహాన్ని గర్భ గుడిలో నెలకొల్పుతారు. విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టేముందు విగ్రహం కింద నవరత్నాలని వేసి హోమాలు తదితర పవిత్ర కార్యక్రమాలని చేసి విగ్రహాన్ని గర్భగుడిలో నెలకొల్పుతారు. దాదాపు అన్ని దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనకీ ఇదే పద్ధతి. 48 రోజులపాటు హోమాన్ని నిర్వహిస్తారు. అన్ని రోజులు హోమం చెయ్యడంవల్ల గర్భగుడి బాగా వేడెక్కిపోతుంది. గర్భగుడిలో ఉష్ణొగ్రతని చల్లబరచడానికి అభిషేకాలు చేస్తారని ఒక నమ్మకం.
ప్రతీరోజూ గర్భగుడిలో విగ్రహానికి ఆలయ పూజారి అభిషేకం చెయ్యాలి. అభిషేక తీర్ధం లేదా పంచామృతాన్ని భక్తులకి పంచుతారు. అభిషేకంలో ఉపయోగించే ముఖ్య పదార్ధాలయిన పాలు, పెరుగు, నెయ్యీ ఆవు నుండి లభించినవే వాడాలి. హైందవ ధర్మం ప్రకారం ఆవు చాలా పూజ్యనీయం ఎందుకంటే ఆవులోనే 33 కోట్ల దేవతలూ కొలువై ఉంటారు. అందువల్లే హిందువులకి ఆవు చాలా పవిత్రమైనది. అభిషేకానంతరం ప్రసాదంగా మనం తీసుకునే పదార్ధాల వల్ల మన శరీరం శుభ్రపడుతుంది. వివిధ రకాల అభిషేకాలకి ఉపయోంచే పదార్ధాలలో ఒక్కోదానికీ ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. గుడిలో లేదా ఇంట్లో విగ్రహాలకి రకరకాల అభిషేకాలు చేస్తారు. వివిధ రకాల అభిషేకాలూ, అందులో ఉపయోగించే పదార్ధాల ప్రాశస్త్యం చూద్దాము. మొట్టమొదట కుంకుమాభిషేకం చేస్తారు. అన్ని విగ్రహాలకీ ఈ అభిషేకాన్ని చేస్తారు.
పసుపూ కుంకుమలు హిందువులకి చాలా ముఖ్యమైనవి. అందువల్ల పసుపుని నీళ్ళల్లో కలిపి విగ్రహం మీదుగా ఆ పసుపు నీళ్ళని పోస్తారు. దాదాపు సకల ప్రాణికోటికీ పాలు ముఖ్య ఆహారం. ఆవు నుండి వచ్చే పాలల్లో ఆరోగ్యకరమైన చర్మానికి కావాల్సిన పదార్ధాలుండటం వల్ల మన చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. గర్భ గుడిలో విగ్రహానికి కూడా మెరుపు రావాలని విగ్రహం మీదుగా పాలు పోసి అభిషేకం చేస్తారు. పాలాభిషేకం తరువాత పెరుగు అభిషేకం చేస్తారు.పంచామృతాల్లో పెరుగుని ఉపయోగిస్తారు. ఈ అభిషేకం చెయ్యడం వల్ల సత్సంతానం కలుగుతుందని నమ్మకం. పంచామృతాల్లో పాలూ, పెరుగు తరువాత ముఖ్యమైన పదార్ధం తేనె. తేనె సేవించడం వల్ల తీయని కంఠస్వరం మీ సొంతమవుతుంది. పంచదార లేదా చెరకు రసం పంచామృతాల్లో ఉపయోగించే మరొక ముఖ్య పదార్ధం. మీ మనసులోనుండి చెడు ఆలోచనలని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పంచదార.
లేత కొబ్బరి నీటితో అభిషేకం చెయ్యడం వల్ల జీవితంలో తృప్తి కలిగి అత్యాశ కలగదు అని ఒక నమ్మకం. ఎండు ద్రాక్షలు, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పు, ఖర్జూరాలు, అంజీరాలు తదితర డ్రై ఫ్రూట్స్ తోపాటు ముక్కలుగా కోసిన అరటిపండు కలిపి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ముఖ్యంగా విగ్రహం చేతులు, నుదురు, చాతీ, మోకాళ్ళు, కాళ్ళు, పాదాలమీద ఈ పదార్ధాలని వేసి అభిషేకం చేస్తారు. అభిషేకం మొదట్లో, చివరన విగ్రహం మీద నీటిని పోస్తారు. అభిషేకంలో ఉపయోగించే ఈ నీటిని దగ్గరలో ఉన్న పవిత్రమైన బావి లేదా నది నుండి పూజారి తీసుకుని వస్తారు.