తెలుగులోగిళ్లలో మామిడాకులకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గుమ్మాలకు తోరణాలుగా.. పూజలో ఉపయోగించే కలశానికి రక్షగా మామిడాకులనే ఉపయోగిస్తారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా.. ఆ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఉండాల్సిందే. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏవి జరిగినా.. ఎన్ని ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ వచ్చినా.. మామిడాకుల స్థానం ఏవీ మార్చలేవు. హిందూ మతంలో గృహప్రవేశ వేడుక ప్రాముఖ్యం ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి మామిడాకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడు. అందుకే.. మామిడాకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. ఇది మన పూర్వీకుల నుంచి కాదు.. మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి.
పూర్వపు స్థూపాల మీద గమనించినట్లైతే.. మామిడిచెట్టు, పండ్లతో కూడిన శిల్పాలు ఉంటాయి. అలాగే తోరణాలను కూడా చెక్కిన కొన్ని గుర్తులు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. కలశం ఎందుకు పెడతామో చాలా మందికి తెలియదు. కలశం అంటే.. భూదేవి రూపం. అందులో పోసే నీళ్లు జీవితానికి ముఖ్య ఆధారం, కొబ్బరికాయ, మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఈ కలశం మొత్తం లక్ష్మీదేవిని సూచిస్తుంది.
మామిడితోరణాలు ఇంటికి కొత్తకళ తీసుకురావడమే కాదు.. ఈ ఆచారం వెనక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల.. ఎక్కువ మంది ఒకేచోట చేరితో ఇంట్లో గాలి కలుషితమవుతుంది. మామిడాకులకు ఆ గాలిని శుద్ధిచేసే గుణం ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయంలో మామిడాకుల తోరణాలు కడతారు. అలాగే మొక్కలు కార్బన్ డైయాక్సైడ్ పీల్చుకుని.. ఆక్సిజన్ వదులుతాయి. కాబట్టి అప్పుడప్పుడైనా.. ఇంటికి మామిడాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుందని భావించారు. అలా ద్వారాలకు తోరణాలు కట్టడం ఆనవాయితీగా మారింది.