శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల కీళ్లలో యూరిక్ యాసడ్ స్ఫటికాలు ఏర్పడుతాయి. దీన్నే ప్రొయాక్టివ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ అని పిలుస్తారు. మన శరీరం ప్యూరిన్లు అనబడే పదార్థాలను సంశ్లేషణ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ప్యూరిన్లు డీఎన్ఏ నిర్మాణానికి, రక్త సరఫరాకు, జీర్ణక్రియకు, పోషకాలను శోషించుకోవడానికి అవసరం అవుతాయి. ఈ క్రమంలో ఏర్పడే యూరిక్ యాసిడ్ రక్తం ద్వారా కిడ్నీలకు చేరుతుంది. అక్కడి నుంచి అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది.
అయితే పరిమితికి మించి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అప్పుడు ఏర్పడే సమస్యను గౌట్ అంటారు. దీన్నే హైపర్ యురిసిమియా అని పిలుస్తారు. సాధారణంగా గౌట్ సమస్య ఎక్కువగా పురుషుల్లోనే వస్తుంది. స్త్రీలలో అయితే మెనోపాజ్ తరువాత ఈ సమస్య వస్తుంటుంది. ఇక మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు మరీ ఎక్కువగా ఉన్నా కూడా గౌట్ సమస్య వస్తుంది. అందువల్ల గౌట్ సమస్య వచ్చిన వారికి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదని చెబుతుంటారు. ముఖ్యంగా పప్పు దినుసులు, చికెన్, పెరుగు వంటి వాటిని తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు.
గౌట్ ముందుగా ఒక కీలు దగ్గర వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని కీళ్లన్నింటికీ గౌట్ వస్తుంది. దీని వల్ల తీవ్రమైన కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. కీళ్ల వద్ద ఎరుపు రంగులో కనిపిస్తుంది. మొదటగా కాలి బొటన వేళ్లకు గౌట్ వస్తుంది. దీంతో గౌట్‌ను సులభంగానే గుర్తించవచ్చు. ఆ తరువాత అది మడమలు, మోకాళ్లు, చేతి వేళ్లు, మణికట్టుకు వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల కీళ్లు బాగా వాపులకు గురవుతాయి.
గౌట్ ఉందని నిర్దారించేందుకు వైద్యులు యూరిక్ యాసిడ్ టెస్టు చేస్తారు. యూరిక్ యాసిడ్ స్థాయిలను బట్టి గౌట్ ఉందీ, లేనిదీ నిర్దారిస్తారు. అధికంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారిలో గౌట్ లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. అయితే గౌట్ సమస్యను తగ్గించేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. దీంతో ఆ సమస్య నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. గౌట్ వచ్చిన వారికి మెంతులు ఎంతో బాగా పనిచేస్తాయి. మెంతులను తినడం వల్ల శరీరంలో లోపల, బయట వచ్చే వాపులు తగ్గుతాయి. అర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. అనంతరం నానబెట్టిన మెంతులను తినాలి. రోజూ ఇలా చేయాలి. దీంతో కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.
2. గౌట్ సమస్యను తగ్గించేందుకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను వెల్లుల్లి తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి తినాలి. ఘాటుగా ఉన్నాయనుకుంటే ఆహారంలో తీసుకోవచ్చు. లేదా ఒక టీస్పూన్ తేనెతో కలిపి తీసుకోవచ్చు. రోజూ ఇలా చేస్తే కొన్ని రోజులకు గౌట్ నుంచి బయట పడవచ్చు.
3. వాము, అల్లం రెండూ చెమట అధికంగా పట్టేలా చేస్తాయి. దీంతో శరీరంలో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఒక కప్పు నీటిలో అర టేబుల్ స్పూన్ వాము, ఒక ఇంచు అల్లం ముక్కను వేసి మరిగించాలి. అనంతరం వచ్చే డికాషన్‌ను వడకట్టి అందులో సగం మిశ్రమాన్ని ఉదయం, మిగిలిన సగం మిశ్రమాన్ని సాయంత్రం సేవించాలి. ఇలా రోజూ చేస్తే గౌట్ నుంచి బయట పడవచ్చు.
4. గౌట్ నొప్పులను తగ్గించడంలో ఆముదం కూడా బాగానే పనిచేస్తుంది. కొద్దిగా ఆముదం తీసుకుని వేడి చేసి దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో ఆ భాగంలో ఉండే విష వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఎరుపుదనం, నొప్పులు తగ్గుతాయి. గౌట్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీనివల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. రోజూ తగిన మోతాదులో కొత్తిమీర నీటిని తాగడం వల్ల గౌట్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని కొత్తిమీర ఆకులను వేసి మరిగించాలి. అనంతరం మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
6. పసుపులో అనేక ఔషధ విలువలు ఉంటాయి. పసుపు తీవ్రమైన వాపును కూడా తగ్గిస్తుంది. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. దీని వల్ల కొన్ని రోజులకు గౌట్ నుంచి బయట పడవచ్చు.
7. రోజూ అర కప్పు మోతాదులో లేదా 10 చెర్రీలను తినడం వల్ల గౌట్ వచ్చే అవకాశాలు 35 శాతం వరకు తగ్గుతాయని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక గౌట్ సమస్య ఉన్నవారు రోజూ చెర్రీలను అరకప్పు మోతాదులో తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365