ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ మూడు పార్టీల జోరు అసలు ఆగడం లేదు. ప్రత్యర్థి పార్టీ అడ్రస్ లేకుండా పోవడంతో కూటమి తన హవాను కొనసాగిస్తోంది. ఇక సీఎం చంద్రబాబు పరిపాలనలోనూ తనదైన మార్కును చూపిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇంకోవైపు సనాతన ధర్మం పేరిట ఆలయాల సందర్శన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాగబాబు గురించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నాగబాబు ఆస్తుల వివరాలు ఎంతో తెలుసా..? అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆ వివరాలను వైరల్ చేస్తున్నారు.
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఇటీవలే నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా తనకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. తనకు మ్యుచువల్ ఫండ్స్, బాండ్ల పేరిట రూ.55.37 కోట్లు, బ్యాంకులో నిల్వ రూ.23.53 లక్షలు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు ఉన్నాయని అఫిడవిట్‌లో చెప్పారు. అలాగే ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08 కోట్ల వరకు ఉన్నాయని అన్నారు.
నాగబాబు తన వద్ద ఒక బెంజ్ కార్ ఉందని, 950 గ్రాముల మేర బంగారం ఉందని తెలిపారు. అలాగే 55 క్యారెట్ల వజ్రాలు, 20 కిలోల వెండి ఉన్నాయని తెలిపారు. మొత్తం రూ.59 కోట్ల మేర చరాస్తులు, రూ.11 కోట్ల మేర స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఇక నాగబాబు తాను చిరంజీవి వద్ద రూ.28 లక్షలు అప్పు తీసుకున్నానని, పవన్ నుంచి రూ.6 లక్షలు అప్పు తీసుకున్నానని చెప్పారు.