త్రివిక్రమ్ అతడు సినిమాలో హీరో ఫుల్లీ కమర్షియల్, క్లెవర్ కిల్లర్… అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఓ పల్లెటూరికి వెళ్లిపోతాడు. అంటే ఓ చోటు నుంచి మరోచోటుకు మారతాడు. అజ్ఞాతవాసాన్ని అనుభవిస్తాడు. జల్సా సినిమాలో హీరో నక్సలైట్. చదువుకోడానికి బయటకు వచ్చేస్తాడు. జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అంటే హీరో ఒక చోట నుంచి మరో చోటుకు మారతాడు. అజ్ఞాతవాసాన్ని వీడతాడు. ఖలేజా సినిమాలో హీరో ట్యాక్సీ డ్రైవర్. ఓ పనిమీద రాజస్థాన్ వెళతాడు. అక్కడే ఓ పల్లెటూరి వారికి దేవుడవుతాడు. అంటే హీరో ఒక చోటు నుంచి మరో చోటుకు మారతాడు.
అత్తారింటికి దారేది సినిమాలో కోటేశ్వరుడైన హీరో అత్తను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చేస్తాడు. అలా హీరో ఓ చోటు నుంచి మరో చోటుకు మారతాడు. ఇది హీరో బంధువుల దృష్టిలో అజ్ఞాతవాసం, హీరో దృష్టిలో వనవాసం. అ.ఆ.. పూర్తిగా కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమా. అయినా సరే దీన్ని వదల్లేదు. హైదరాబాదులో ఉండే హీరోయిన్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని అత్తారింటికి వస్తుంది. అంటే ఆవిడ ఓ చోట నుంచి మరో చోటకు మారుతుంది. ఇది హీరోయిన్ తండ్రి దృష్టిలో జ్ఞాత వాసం. తల్లి దృష్టిలో అజ్ఞాతవాసం.
జులాయి సినిమాలో హీరో విశాఖపట్టణంలో ఉంటారు. కోటాను కోట్ల కుంభకోణానికి సంబంధించి ప్రధాన సాక్షి కావడంతో హీరో ఇక్కడ అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాదుకు మకాం మారుతుంది. అంటే ఇక్కడా హీరోకి స్థాన చలనం తప్పదన్నమాట. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోకి రెండు స్థానచలనాలు, ఒకటి జీవనం పరంగా.. అంతస్తుల నుంచి పతనావస్థకు చలనం.. మరోటి స్థానం పరంగా.. తన తండ్రి అమ్మిన స్థలాన్ని ఇప్పించేందుకు తమిళనాడు బోర్డర్‌కు పయనం. అజ్ఞాతవాసి సినిమా అయితే.. అసలు పేరులోనే అజ్ఞాత వాసం ఉంది. ఈ సినిమా గురించి ఇక చర్చే అనవసరం.
అరవిందసమేత వీర రాఘవ. ఈ సినిమాలోనూ అంతే హీరో ఎంట్రీనే విదేశాల నుంచి రాయలసీమకు వస్తాడు. తండ్రి చనిపోగానే తాను అజ్ఞాతంలోకి వెళ్లడమే సమస్యలకు పరిష్కారం అని భావిస్తాడు. అలవైకుంఠపురములో సినిమాలో హీరోకి నెలల పురిట్లోనే స్థాన చలనం తప్పదు. ఇలా త్రివిక్రమ్ అన్ని సినిమాల్లోనూ ఈ లాజిక్ కచ్చితంగా ఉంటుంది. దీన్ని ఆయన తన సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకనే ప్రతి సినిమాలోనూ ఇలా కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది.