నాన్ వెజ్ అంటే మాంసాహార ప్రియులకు ఇష్టమే. రకరకాల నాన్ వెజ్ వెరైటీలను ఆరగించేస్తుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ నాన్ వెజ్ తిన్న తరువాత జీర్ణం సరిగ్గా అవదని చెప్పి కొందరు కూల్ డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. కూల్ డ్రింక్స్‌లో సోడా ఉంటుంది కనుక అది గ్యాస్ ను బయటకు పంపుతుందని, దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ఱం అవుతుందని భావిస్తారు. అయితే నాన్ వెజ్ తిన్న తరువాత ఇలా కూల్ డ్రింక్ ను తాగడం కరెక్టేనా..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా..? అంటే.. కచ్చితంగా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
నాన్ వెజ్ తిన్న తరువాత ఆహారం జీర్ణం అవడం కోసం కూల్ డ్రింక్‌లను తాగకూడదని వైద్యులు అంటున్నారు. అసలు కూల్ డ్రింక్‌ను ఇతర సమయాల్లోనూ తాగడం అంత మంచిది కాదని, అందులోనూ నాన్ వెజ్ తిన్న తరువాత అయితే అసలు తాగకూడదని అంటున్నారు. ఎందుకంటే కూల్ డ్రింక్‌లలో ఉండే సమ్మేళనాలు మన జీర్ణాశయ గోడలపై ప్రభావం చూపిస్తాయి. కూల్ డ్రింకుల్లో ఉండే ఆమ్లత్వం కారణంగా జీర్ణాశయం గోడలపై ఉండే మ్యూకస్ దెబ్బ తింటుంది. దీంతో అసిడిటీ సమస్య వస్తుంది. కడుపులో మంట ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇది అల్సర్లకు దారి తీస్తుంది. కనుక నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే కాదు, అసలు కూల్ డ్రింక్‌లను ఏ సమయంలో తాగినా మంచిది కాదని అంటున్నారు.
అయితే మరి ఆహారం తిన్న తరువాత అది జీర్ణం అవ్వాలంటే ఏం చేయాలి..? అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అందుకు వైద్యులు ఏమంటున్నారంటే.. ఆహారం తిన్నాక సోంపు గింజలను నమలవచ్చు. లేదా జీలకర్ర వేసి మరిగించిన నీళ్లను తాగవచ్చు. వాము, ఉప్పు కలిపి తినవచ్చు. లేదా పైనాపిల్, బొప్పాయి వంటి పండ్లను తినవచ్చు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు కావల్సిన ఎంజైమ్‌లు రిలీజ్ అయ్యేలా చేస్తాయి. దీంతో సహజసిద్ధంగా ఆహారం జీర్ణం అవుతుంది. అంతేకానీ నాన్ వెజ్ తిన్నామని చెప్పి కూల్ డ్రింక్‌లను ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదు.