1999లో సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. మొట్టమొదటిసారిగా హీరో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్‌లోనూ, తెలుగు సినిమా రంగంలోనూ మరుపురాని హిట్. హీరో కుటుంబానికి విలన్ కుటుంబానికి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి. ఇరుపక్షాల వారూ ఫ్యాక్షనిస్టులే. ఒక దురదృష్టకరమైన క్షణంలో విలన్ దొంగదెబ్బ తీసి హీరో కుటుంబంలోనూ, పరివారంలోనూ చాలామందిని చంపేస్తాడు. ఆ బాధను గుండెల్లో దాచుకున్న హీరో వేరే బాధ్యత కారణంగా తాను మహారాజులా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడో దూరాన పేరు మార్చుకుని, తీరుమార్చుకుని తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటాడు.
విలన్ మాత్రం శత్రుశేషం మిగలకూడదని హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ విలన్‌తో తలపడాల్సి వస్తుంది. ఈసారి తిరిగి తన గడ్డకు తిరిగి వస్తాడు. ప్రజలు అన్నా అని బ్రహ్మరథం పడతారు. అనుచరులు కన్నీళ్ళు తుడుచుకుంటారు. చివరకు విలన్‌పై గెలుపుసాధించి శాంతిని నెలకొల్పుతాడు. ఇందులో ఒకటి రెండు స్పెసిఫిక్ విషయాలు (హీరో అనుచరుడిని అనుకోకుండా హీరో చంపడం వల్ల వాళ్ళ చెల్లెళ్ళ బాధ్యత వస్తుంది), జనంతో ఈలలు వేయించే పవర్‌ఫుల్ డైలాగులు మారిస్తే – ఇదే కథతో తర్వాత అదే బాలకృష్ణ నరసింహనాయుడు తీశాడు. సూపర్ హిట్. అలాంటి కథతోనే ఎన్టీఆర్ ఆది వచ్చింది. సూపర్ హిట్. అదే విధంగా చిరంజీవి ఇంద్ర వచ్చింది. అది కూడా బంపర్ హిట్ అయ్యింది.
ఇలా ఎంతకాలమైనా ఎన్ని సినిమాలైనా వచ్చేవి. కానీ, చూసీచూసీ ఈ ట్రెండ్ మీద జనానికి ఆసక్తి పోయింది. అప్పుడు కానీ, ఆ సినిమాలు రావడం ఆగలేదు. సమరసింహారెడ్డిగా బాలయ్య ఎంట్రీ. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ఇదే మొదలు. ఇప్పుడు, లీడర్, భరత్ అనే నేను సినిమాల విషయానికి వస్తే – రెండిటికి మధ్య ఏ రెండు సూపర్ హిట్ ఫ్యాక్షన్ సినిమాల మధ్య కన్నా చాలా తేడాలు ఉన్నాయి. లీడర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా. రానాకు ఏ ఇమేజ్ లేదు. భరత్ అనే నేనులో పాలిటిక్స్‌తో పాటు మహేష్ హీరోయిజం కూడా చొప్పించారు. లీడర్ ట్రీట్‌మెంట్ వేరు. భరత్ అనే నేను ట్రీట్‌మెంట్ వేరు. లీడర్ ఏమీ సమరసింహారెడ్డి లెవల్ హిట్ కాదు.
కాబట్టి, ఈ రెండూ కూడా రావడం, అందులో భరత్ అనే నేను కమర్షియల్‌గా బాగా వర్కవుట్ కావడం పెద్ద విచిత్రం కాదు. గట్టిగా మాట్లాడితే – హీరో ముఖ్యమంత్రి కావడం లేదంటే హీరో ముఖ్యమంత్రులను శాసించే కింగ్ మేకర్ కావడం మంచి పవర్‌ఫుల్ కాన్సెప్ట్. ఫ్యాక్షన్ సినిమాల్లోలాగా ఒకే కథ తిప్పీతిప్పీ పిప్పి చేయక్కరలేదు. గత డెబ్భై అయిదేళ్ళ స్వతంత్ర్య భారత రాజకీయ చరిత్రలో కేంద్రం, రాష్ట్రాలు కలుపుకుంటే బ్రహ్మాండమైన డ్రామా ఉన్న రసవత్తర రాజకీయ ఘట్టాలు బోలెడు. దిమ్మదిరిగించేంత పవర్‌ఫుల్ రాజకీయ నాయకులు, వాళ్ళు పదవికోసం చేసిన పోరాటాలు కూడా బోలెడు. జయలలిత, ఎన్టీఆర్, మోదీ, యోగి, సోనియా, ఇందిర, వైఎస్సార్, కేసీఆర్, పీవీ, బాల్ థాకరే, జ్యోతిబసు, మమత, కరుణానిధి, ఎమ్జీఆర్ – వంటివారి రాజకీయ జీవితాల్లోకి తొంగిచూస్తే పుంఖానుపుంఖాల కాన్సెప్టులు, సీన్లు, క్యారెక్టరైజేషన్లు దొరుకుతాయి. సుబ్బరంగా ఇంకో అరడజన్ సినిమాలు చేసుకున్నా హిట్ అవుతాయి.