మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈయన అసలు పేరు మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ అలియాస్ మమ్ముక్క. అయితే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరును మమ్ముట్టిగా మార్చుకున్నారు. మమ్ముట్టి మలయాళం తో సహా దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈయనకు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. తన విలక్షణ నటనతో అందరినీ మెప్పించగల గొప్ప నటుడు మమ్ముట్టి.
అయితే ఈ మధ్యకాలంలో పరభాషా నటులు తెలుగు, హిందీ భాషల్లో విలన్స్ గా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అల్లు అరవింద్ జల్సా సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం మలయాళం స్టార్ మమ్ముట్టిని అప్పట్లో అడిగారట. అప్పుడు మమ్ముట్టి ఇచ్చిన రిప్లై విని అల్లు అరవింద్ ఫోన్ పెట్టేసారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ లో గుర్తు చేసుకున్నారు. ఆ ప్రెస్ మీట్ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను పది సంవత్సరాల క్రితం ఒకసారి మమ్ముట్టి గారికి కాల్ చేశాను. మా చిత్రంలో ఒక మంచి పాత్ర ఉంది. మీరు చేయాలి అన్నాను.
దీనికి ఆయన ఏం క్యారెక్టర్ అని నన్ను అడిగారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నారని.. అందులో మంచి విలన్ పాత్ర ఉందని చెప్పాను. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై నన్ను షాక్ కి గురి చేసింది. ఆయన ఏమన్నారంటే.. ఆహా అట్లాగా.. ఈ పాత్రని చిరంజీవిని వేయమని నువ్వు అడగగలవా.! అని నన్ను తిరిగి ప్రశ్నించారు మమ్ముట్టి. దానికి నేను సారీ సార్ అని ఫోన్ పెట్టేసాను అని చెప్పారు అల్లు అరవింద్. ఈ విధంగా జల్సా సినిమా సమయంలో జరిగిన ఈ విషయాన్ని గతంలో గుర్తు చేసుకున్నారు అల్లు అరవింద్.