శరీరంలోని ఇతర కండరాలవలే, గుండె కూడా ఒక కండరమే. గుండె శరీరమంతా రక్తప్రసరణ చేస్తుంది. దానికి ప్రతిరోజూ తగిన వ్యాయామం కావాలి. వ్యాయామం చేయకపోతే శరీరం అనారోగ్యాలకు గురవుతుంది. చేసే వ్యాయామాలు మొదలు పెట్టేటపుడు తక్కువ సమయంలోను, క్రమేణా అధిక సమయానికి మార్చాలి. వ్యాయామం రక్తప్రసరణ అధికం చేసి గుండె బాగా పని చేయటానికి తోడ్పడుతుంది. వ్యాయామం అంటే అలసిపోయేట్లు పరుగులు పెట్టటం మాత్రమే కాదు. లేదా ఖరీదైన వ్యాయామ పరికరాలు కొని ఉపయోగించటమే కాదు.
శరీరాన్ని వివిధ రకాలుగా కూడా శ్రమపెట్టవచ్చు. గుండెజబ్బు రోగులు కొన్ని పరిస్ధితులలో వ్యాయామం చేయలేకపోతారు. అటువంటపుడు వారు తమ శరీరంలో గుండె ఆరోగ్యానికి చేయాల్సిందేమిటో పరిశీలించండి. ప్రతిరోజూ కొంత సమయం నడవాలి. కారు లేదా బస్ ఉపయోగించేటపుడు కొంచెం ఆలోచించండి. లిఫ్టులు, లేదా ఎస్కలేటర్లవంటివి ఉపయోగించేకంటే, మెట్లు ఎక్కండి. నడక చాలా మంచిది. మీరు నడిచేటపుడు కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా పాల్గొనేలా చేయండి.
ఏ రకమైన శారీరక శ్రమ చేసినప్పటికి మీరు ఆనందించేదిగా వుండాలి. బోర్ కొట్టేదిగా వుండే పనులు చేయటంలో అర్ధం లేదు. వయసులో పెద్దవారయ్యే కొద్ది, నడక, సైకిలింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి తేలికగా ఆచరించవచ్చు. అయితే వాటి వేగం తగ్గించాలి. స్ధానికంగా వుండే వినోద కేంద్రాలను సందర్శించి వాటిలో మీకు సరి అయిన శారీరక శ్రమ కల్పించే కార్యక్రమాలలో లేదా చర్యలలో పాల్గొనండి. అధిక శ్రమ కలిగించే వ్యాయామాలకు సరైన శిక్షకుల పర్యవేక్షణ సూచించదగినది.