ఆరోగ్యంగా ఉండాలన్నా, అధిక బరువును తగ్గించుకోవాలన్నా.. నిత్యం వ్యాయామాలు చేయాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇష్టానికి, అనుకూలతలకు అనుగుణంగా పలు రకాల వ్యాయామాలను నిత్యం చేస్తుంటారు. ఇక కొందరు జిమ్‌లలో గంటల తరబడి సాధన చేస్తుంటారు. అధికంగా బరువులు ఎత్తుతూ బాగా కష్టపడిపోతుంటారు. అయితే అన్ని వ్యాయామాల కన్నా జాగింగ్ చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అందుకని జిమ్‌లకు వెళ్లలేని వారు జాగింగ్ చేస్తే ఫిట్‌గా ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక జాగింగ్ విషయానికి వస్తే చాలా మంది ఉదయాన్నే జాగింగ్ చేస్తుంటారు. కొందరు సాయంత్రం వేళ్లలో జాగింగ్ చేస్తుంటారు. అది కూడా వారి అనుకూలతలను బట్టే జాగింగ్ చేస్తారు. అయితే నిజానికి జాగింగ్‌ను ఏ సమయంలో చేస్తే మంచిదనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ క్రమంలోనే అసలు జాగింగ్ ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసుకునేందుకు కాలిఫోర్నియా, ఇజ్రాయెల్ యూనివర్సిటీ పరిశోధకులు కొందరు ఇటీవలే ప్రయోగాలు చేశారు. చివరికి తేలిందేమిటంటే… ఉదయం కన్నా సాయంత్రం జాగింగ్ చేస్తేనే మంచిదని వారు చెబుతున్నారు.
సదరు సైంటిస్టులు ట్రెడ్‌మిల్స్ పై ఎలుకలను రోజులో వేర్వేరు సమయాల్లో పరిగెత్తించారు. ఈ క్రమంలో ఉదయం కన్నా సాయంత్రం సమయంలో జాగింగ్ చేసిన ఎలుకలే 50 శాతం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. సాయంత్రం పూట జాగింగ్ చేయడం వల్ల ఉత్సాహంగా ఉండవచ్చని, అధిక బరువు కూడా త్వరగా తగ్గుతారని అంటున్నారు. కనుక మీలో ఎవరైనా ఉదయం జాగింగ్ చేస్తుంటే.. సాయంత్రానికి మార్చి చూడండి.. తేడా వస్తే అదే కంటిన్యూ చేయండి. ఏది ఏమైనా.. జాగింగ్ చేయడం మాత్రం మరిచిపోకండి.. ఆరోగ్యమే మహాభాగ్యం కదా..!