Categories: Featured

ఆయుర్వేద ప్రకారం రోజూ పాటించాల్సిన ఆహార నియమాలు..!

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మనిషి నిత్యం యాంత్రిక జీవనంలో గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకుంటున్నాడు. దీని వల్ల అధిక బరువు, పొట్ట పెరగడం, చిన్న వయస్సులోనే షుగర్‌ వ్యాధి రావడం వంటివి జరుగుతున్నాయి. కానీ ఆయుర్వేద ప్రకారం మనిషి సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

ayurvedam ahara niyamalu

బయట జంక్‌ ఫుడ్‌ తినే బదులు ఇంట్లో సున్నుండు, పాయసం వంటివి తినాలి. వీటిల్లో పాలు, నెయ్యి, తేనె వంటివి ఉంటాయి. ఇవి జీవరసాయనాలు. సప్తధాతువులకు శక్తిని అందిస్తాయి. ఇక ఆయుర్వేదం ప్రకారం ఉదయం 8 లోపు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7 గంటల లోపు భోజనాన్ని ముగించడం మంచిది. అలాగే భోజనానికి ముందు చెరకు వంటివి తీసుకోవాలి. ఉదయం నేరేడు, కొబ్బరి, మామిడి పండ్లు, పనస, అరటి పండ్లను తినకూడదు. తీపి వంటకాలను భోజనం తరువాతే తినాలి.

రోజూ తినే ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. తీపి, కారం, చేదు, ఉప్పు, వగరు, పులుపులను రోజూ అందేలా చూసుకోవాలి. తీపి పదార్థాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కారం, పులుపు పదార్థాలు జీర్ణశక్తిని, చేదు జ్ఞాపకశక్తిని, రక్తశోధనని కలుగజేస్తాయి. వగరు కఠిన పదార్ధాలను జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఉప్పు ఆహారానికి రుచిని అందిస్తుంది.

భోజనం చేసేందుకు ముందు రొట్టెలు, చపాతీలు తినాలి. తరువాత అన్నం తినాలి. పలుచని మధుర పదార్థాలను అన్నానికి ముందు తినాలి. కారం, పులుపు పదార్థాలను మధ్యలో తినాలి. వగరు, చేదు పదార్థాలను భోజనం చివర తినాలి. తరువాత మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోవాలి. ఇక అన్ని కూరగాయలు వేసి తయారు చేసే సూప్‌ను కనీసం వారంలో ఒక్కసారి అయినా తీసుకోవాలి.

రోజూ భోజనంలో మిరియాలు, ధనియాలు వేసిన చారును తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక పెరుగు – నెయ్యి, అరటి పండ్లు – పాలను ఒకేసారి తీసుకోరాదు. వేడి కాఫీ, టీలలో తేనె కలపరాదు. చేపలు, వెన్న కలిపి తినరాదు. వండరాదు. సీజనల్‌గా లభించే పండ్లను తీసుకోవాలి. వేసవికాలంలో మన జీర్ణశక్తి తగ్గుతుంది. కనుక తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రాత్రి పెరుగు తినరాదు. శ్లేష్మం చేరుతుంది. యవ్వనంలో ఉన్నవారు ప్రోటీన్లు, విటిమన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

పెద్దలు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తినాలి. పాలు, తేనె, బార్లీ నీళ్లు, మజ్జిగ తాగాలి. గర్భిణీలు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఒక పూట తిన్న ఆహారం జీర్ణంకాకపోతే రెండో పూట తినకూడదు. అన్నం మొదటి ముద్దలో పాత ఉసిరికాయ పచ్చడి తింటే మేలు. ధనియాల పొడితో అన్నం చివర్లో తినాలి. రాత్రి నిద్రించే ముందు పిల్లలకు పాలలో పటిక బెల్లం పొడి కలిపి ఇవ్వాలి. నిద్రించే సమయం వరకు రాత్రి మీరు ఆహారం చాలా వరకు జీర్ణం అయ్యేలా చూసుకోవడం మంచిది. అందుకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తినాలి. అలాగే రాత్రి భోజనానికి, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఇక అన్నం తిన్న వెంటనే శృంగారంలో పాల్గొనరాదు. తిన్న తరువాత కొంత సేపు నడిస్తే మంచిది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts