పురాతన కాలం నుండే ఆయుర్వేద మూలికలు అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని అందించాయి. ఇది నేరుగా అనారోగ్యానికి చికిత్స చేయదు. మనస్సు, శరీరం, ఆత్మలను సమతుల్యం చేస్తుంది. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడంపై దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో అనారోగ్యాలు తగ్గుతాయి. అలాగే సరైన ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని కలిగి ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది.
నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. ఆయుర్వేదం అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. ఆయుర్ అంటే “జీవితం” లేదా “దీర్ఘాయువు” అని అర్థాలు వస్తాయి. అలాగే వేదం అంటే “సైన్స్” లేదా “పవిత్ర జ్ఞానం”. అందువల్ల ఆయుర్వేదం అంటే “జీవిత పవిత్రమైన జ్ఞానం” అని అర్థం వస్తుంది.
అయితే.. పలు సాధారణ ఆయుర్వేద మూలికల గురించి వేదాస్ క్యూర్ వ్యవస్థాపకుడు వికాస్ చావ్లా వివరించారు. వీటిని అనారోగ్య సమస్యలను నయం చేయడం కోసం తరచూ ఉపయోగిస్తారు.
అశ్వగంధ
దీన్ని విథానియాసోమ్నిఫెరా అంటారు. భారతదేశం, ఉత్తర ఆఫ్రికాలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. దీని వేళ్లు, కాయలను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. నిద్రలేమి సమస్య ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కండరాలు వృద్ధి చెందుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పురుషుల్లో శృంగార సమస్యలు ఉండవు. సంతానోత్పత్తికి అశ్వగంధ సహాయ పడుతుంది.
బోస్వెల్లియా
దీన్నే ఫిరంగి మొక్క లేదా సాంబ్రాణి మొక్క అని కూడా పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల జాబితాకు ఇది చెందుతుంది. భారతీయులు ఎంతో కాలం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. మసాలా దినుసులా ఉంటుంది. శరరీంలో మంటను తగ్గిస్తుంది. నొప్పులు తగ్గుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో నొప్పులు తగ్గుతాయి. నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చిగుళ్ల వాపు తగ్గుతుంది. పెద్ద పేగు వ్యాధులు రాకుండా ఉంటాయి. క్రోన్స్ వ్యాధి ఉన్నవారిలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే దీర్ఘకాలిక ఉబ్బసం ఉన్నవారిలో సమస్యలను తగ్గిస్తుంది.
త్రిఫల
ఉసిరికాయ, కరక్కాయ, తానిక్కాయలకు చెందిన పొడులను సమ పాళ్లలో తీసుకుని తయారు చేసే చూర్ణాన్ని త్రిఫల అంటారు. ఈ చూర్ణం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆర్థరైటిస్ మంటలను తగ్గిస్తుంది. క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. మలబద్దకం, కడుపు నొప్పి తగ్గుతాయి. అపానవాయువు ఎక్కువగా విడుదల కాకుండా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారిలో పేగుల కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది.
బ్రహ్మి
బ్రహ్మి (బాకోపమోనియరీ) ఒక ఆయుర్వేద మూలిక. ఇది ప్రసిద్ధ NSAIDలలో కనిపించే వాటితో పోల్చదగిన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
జీలకర్ర
జీలకర్ర సుదీర్ఘ చరిత్ర కలిగిన మధ్యధరా, నైరుతి ఆసియా మసాలా దిరుసు. ఇది క్యుమినంసైమినం మొక్క విత్తనాల నుండి తయారవుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌ల కార్యకలాపాలను పెంచుతుంది. కాలేయం నుండి పిత్తాన్ని విడుదల చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఫలితంగా ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. కొవ్వు జీర్ణక్రియ సులభతరం అవుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. జీలకర్ర టైప్ 2 డయాబెటిస్ నివారణకు సహాయపడుతుంది. ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు, హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు సహాయ పడుతుంది. దీంతో గుండె జబ్బులను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
పసుపు
పసుపు కూడా మనం వాడే పోపు దినుసుల్లో ఒకటి. ఇందులో కర్కుమిన్ అనబడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల నొప్పులను తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులోని సమ్మేళనాలు మెదడులోని న్యూరోట్రోఫిక్ కారకం (బీడీఎన్ఎఫ్) స్థాయిలను పెంచడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. తక్కువ BDNF స్థాయిల వల్ల అల్జీమర్స్, డిప్రెషన్ వంటి వ్యాధులు వస్తాయి.
కాకరకాయ
కాకరకాయ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు, ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
యాలకులు
సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకులను పిలుస్తారు. పురాతన కాలం నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో యాలకులను వాడుతారు. యాలకుల పొడిని తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. అల్సర్లను తగ్గిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365