Categories: Featured

చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌బ‌డుతుందా ? అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

చాలా మందికి చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌బ‌డుతుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం, రసాయ‌నాల‌తో క‌లిగిన సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను అధికంగా వాడ‌డం, జన్యుప‌ర‌మైన లోపాలు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చిన్న‌త‌నంలోనే జుట్టు కొంద‌రికి తెల్ల‌బ‌డుతుంది. ఇక మహిళ‌ల క‌న్నా పురుషుల్లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న స్ఫ‌ష్ట‌మైన కార‌ణాన్ని సైంటిస్టులు ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేక‌పోయారు.

grey hair in young age know the reasons

చాలా మంది హెయిర్ జెల్స్‌, క్రీమ్‌లు వాడుతుంటారు. ఇక కొంద‌రు రసాయ‌న రంగులు వాడుతుంటారు. అలాగే కొంద‌రిలో వ‌ర్ణ ద్ర‌వ్య‌మైన మెల‌నిన్ లోపం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల కూడా శిరోజాలు తెల్ల‌గా అవుతుంటాయి.

ఒత్తిడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, నిద్ర‌లేమి, ఆందోళ‌న‌, హైబీపీ ఉన్న‌వారు, ఆక‌లి స‌రిగ్గా అవ‌క‌పోవ‌డం, వెంట్రుక‌ల మూల‌క‌ణాల క్షీణ‌త‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉండ‌డం, విట‌మిన్ బి12 లోపం, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉండ‌డం, ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయ‌డం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందిలో చిన్న వ‌య‌స్సులోనే వెంట్రుక‌లు తెల్ల‌బ‌డుతుంటాయి.

ఇక ఈ స‌మ‌స్య‌కు చికిత్స చేయ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే స‌రైన కార‌ణం తెలిస్తేనే అందుకు అనుగుణంగా చికిత్స చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు థైరాయిడ్ వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తే అందుకు త‌గిన మందులు వాడితే అప్పుడు ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలా.. జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనే స‌మ‌స్య‌కు స‌రైన కార‌ణం తెలియాల‌న్న‌మాట‌. అప్పుడే చికిత్స చేస్తే స‌రైన ఫ‌లితం వ‌స్తుంది.

ఉసిరికాయ‌లు తిన‌డం లేదా వాటి జ్యూస్‌ను రోజూ తాగ‌డం, విట‌మిన్ సి ఉండే పండ్ల‌ను తిన‌డం, గోరింటాకును పేస్ట్‌లా చేసి జుట్టుకు హెయిర్ ప్యాక్ లా వేసుకోవ‌డం, జింక్‌, బ‌యోటిన్, కాల్షియం, రాగి, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డే స‌మ‌స్య‌ను కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. ఇక థైరాయిడ్ ఉన్న‌వారు ఆ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేసేలా చూసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండేలా చూడాలి. అలాగే విట‌మిన్ బి12 ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ధూమ‌పానం చేసేవారు, మ‌ద్యం సేవించే వారు ఆ అల‌వాట్ల‌ను మానేయాలి. ఇలా ప‌లు సూచ‌న‌లు పాటించ‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts