వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు మన మీద అటాక్ చేస్తుంటాయి. దీంతో మనం డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఈ అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో దోమలను తరిమేందుకు చాలా మంది మస్కిటో రీపెల్లెంట్స్ వాడుతారు. కొందరు దోమ తెరలను ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలను తరిమేయవచ్చు. దీంతో దోమలు మన ఇళ్లలోకి రావు. మరి దోమలను తరిమేందుకు ఇళ్లలో పెంచుకోవాల్సిన ఆ మొక్కలు ఏమిటంటే..
1. ది ఫోర్ ఒ క్లాక్ ఫ్లవర్ (The four o’ clock flower)
దీన్నే Mirabilis Jalapa అని సైంటిఫిక్ పేరుతో పిలుస్తారు. ఇది పెరూ దేశంలో ఎక్కువగా పెరుగుతుంది. మన దేశంలో అనేక నర్సరీల్లో దీన్ని విక్రయిస్తున్నారు. ఇది మధ్యాహ్నం పూట, సాయంత్రం 4 గంటల సమయంలో పూలను పూస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ మొక్క పూలు దోమలనే కాదు, దోమ లార్వాను కూడా చంపుతాయి. కనుక ఈ మొక్కను ఇంటి ద్వారాలు, తలుపులు, కిటికీల వద్ద పెంచుకుంటే మంచిది. దీంతో దోమల నుంచి రక్షణ లభిస్తుంది.
2. తులసి
ఈ మొక్క సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండే ఔషధ గుణాలు అనేకం. అనేక అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి తులసికి ఉంది. అయితే అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, దోమలను తరిమే శక్తి కూడా తులసికి ఉంది. వీటి పూలు దోమలను దూరంగా తరుముతాయి. కనుక తులసి మొక్కను పెంచుకున్నా దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు.
3. లావెండర్ మొక్క
లావెండర్ మొక్క ఆకుల నుంచి వచ్చే వాసన మాత్రమే కాదు, ఈ మొక్క పూలు కూడా దోమలను తరిమేస్తాయి. కనుక ఈ మొక్కను ఇంట్లో పెట్టుకున్నా ఉపయోగం ఉంటుంది. అయితే లావెండర్ నూనెను నిద్రించడానికి ముందు చర్మానికి రాసుకుంటే దాని వాసనకు మనల్ని దోమలు కుట్టకుండా ఉంటాయి.
4. బంతి పువ్వు
దీన్ని మన దేశంలో చాలా మంది అలంకరణ కోసం వాడుతారు. బంతిపూలను దండలుగా కట్టి ఆయా కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారు. అయితే బంతి పూలు దోమలను తరిమి కొడతాయి. బంతిపూల మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దోమల నుంచి జాగ్రత్తగా ఉండవచ్చు. బంతి పూలను నలిపి చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి.
5. గెరానియం (Geranium)
ఈ మొక్క పువ్వుల నుంచి వచ్చే వాసన నిమ్మకాయల వాసనను పోలి ఉంటుంది. అయితే ఈ వాసన దోమలను తరిమేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకున్నా చాలు దోమల నుంచి రక్షణ లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365