మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునేందుకు సహాయ పడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు పనితీరుకు దోహదపడతాయి. అందువల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను రోజూ మనం తీసుకోవాలి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఒకటని వైద్యులు చెబుతుంటారు. వీటి లోపం వస్తే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లోపిస్తే మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది. దీంతో ఆ లోపాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటూ ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ల గ్రూప్‌కు చెందినవి. శరీరంలో అనేక విధులను సరిగ్గా నిర్వర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటి వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో గుండె, రక్త నాళాలు, ఊపిరితిత్తులు, రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటాం.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. రక్తనాళాలు వాపులకు గురి కాకుండా ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. మహిళలకు పీరియడ్స్ సమయాల్లో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు. శరీరంలో మెదడుకు సంబంధించిన రసాయనాల నిర్వహణకు, జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు, మూడ్‌కు, తెలివితేటలకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు దోహదం చేస్తాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల లోపం వస్తే శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుంది. చర్మం పొడిగా మారుతుంది. గోళ్లు చిట్లిపోతాయి. పలుచగా మారి సులభంగా విరిగిపోతాయి. నిద్రలేమి సమస్య వస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. పనిమీద ఏకాగ్రత, ధ్యాస పెట్టలేరు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల లోపం వస్తే ఆయా లక్షణాలు కనిపిస్తాయి. కనుక వాటిని గుర్తుపట్టి వాటి లోపం ఉందని తెలుసుకోవాలి. దీంతో ఆహారంలో పలు మార్పులు చేసుకుంటే ఆ లోపం నుంచి బయట పడవచ్చు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా వాల్ నట్స్, పాలు, చియా విత్తనాలు, కోడిగుడ్లు, అవిసె గింజలు, చేపలు, కనోలా ఆయిల్, ట్యూనా ఫిష్, ఇతర సీఫుడ్, రాజ్మా, సోయాబీన్ ఆయిల్, చికెన్‌లలో ఉంటాయి. వీటిని తరచూ తీసుకుంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల లోపం నుంచి బయట పడవచ్చు. అయితే డాక్టర్ల సలహా మేరకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లకు చెందిన సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. దీంతో వాటి లోపం నుంచి బయట పడవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365