ప్రస్తుత తరుణంలో మనకు ఎక్కడ చూసినా కీటోజెనిక్ డైట్ (Ketogenic diet) అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. కీటోజెనిక్ డైట్‌ను పాటించి బరువు తగ్గామని కొందరు చెబుతున్నారు. ఇక కొందరు అయితే డయాబెటిస్ తగ్గిందని అంటున్నారు. అయితే ఇంతకీ అసలు కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి ? ఈ డైట్‌ను ఎలా పాటించాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి ? అసలు కీటోజెనిక్ డైట్‌లో ఎలాంటి ఫుడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది ? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కీటోజెనిక్ డైట్ అంటే ?
సాధారణంగా మన శరీరం పనిచేయాలంటే గ్లూకోజ్ అవసరం అవుతుందని అందరికీ తెలిసిందే. మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్లు) వల్ల మనకు గ్లూకోజ్ లభిస్తుంది. దీంతో శక్తి వస్తుంది. ఫలితంగా మనం రోజంతా యాక్టివ్‌గా పనిచేయగలుగుతాం. అయితే కీటోజెనిక్ డైట్‌లో మన శరీరం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. అయితే అలా శరీరం కొవ్వును ఉపయోగించుకోవాలంటే మనం కీటోజెనిక్ డైట్‌ను పాటించాలి. అందుకు తగిన ఫుడ్స్‌ను తీసుకోవాలి.
కీటోజెనిక్ డైట్ ఫుడ్స్ ఏవి ?
కొవ్వు పదార్థాలు అన్నీ కీటోజెనిక్ ఫుడ్స్ కిందకు వస్తాయి. అంటే వేపుళ్లు, చిరుతిండి, నూనె పదార్థాలు కాదు. నట్స్, మాంసాహారం, చేపలు వంటివన్నమాట. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ పదార్థాలను కీటోజెనిక్ డైట్‌లో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్లను చాలా తక్కువగా తీసుకోవాలి. 50 గ్రాముల మోతాదు కన్నా తక్కువగా కార్బొహైడ్రేట్లను తీసుకోవాలి. ఇక నిత్యం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
కీటో డైట్ ఫుడ్ లిస్ట్
* చికెన్, మటన్, చేపలు, రొయ్యలు
* కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే అన్ని ఆకుకూరలు, కూరగాయలు
* నట్స్, గింజలు (అవిసెలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు)
* కొబ్బరినూనె, వెన్న, నెయ్యి, చీజ్, పాల మీద మీగడ
* కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్,
కీటో డైట్‌లో లేని ఆహారాలు
* గోధుమలు, మొక్కజొన్న, తృణ ధాన్యాలు, బియ్యం తినరాదు.
* తేనె, చక్కెర లాంటి తీపి పదార్థాలు తినరాదు.
* యాపిల్, అరటిపండ్లు, నారింజ పండ్లను తినరాదు.
* ఆలుగడ్డలు, క్యారెట్లు వంటి దుంపలు తినరాదు.
* కార్బొహైడ్రేట్లు ఉండే ఇతర అన్ని ఆహారాలు
పైన తెలిపిన విధంగా కీటో డైట్ ఫుడ్ లిస్ట్‌లో ఉన్న ఆహారాలను తినడం మొదలు పెట్టాలి. నిత్యం కార్బొహైడ్రేట్లు చాలా చాలా తక్కువగా తినాలి. ప్రోటీన్లు, కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో 3 నుంచి 4 రోజుల్లో శరీరంలో కీటోసిస్ అనే దశలోకి వెళ్తుంది. అంటే మీ శరీరం కీటోజెనిక్ డైట్ కు అలవాటు పడి కీటో డైట్‌లోకి ఎంటర్ అయినట్లు లెక్క. ఈ దశలో కీటో ఫ్లూ వస్తుంది. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
కీటోసిస్ దశలోకి ప్రవేశించగానే అలసట ఉంటుంది. ఒళ్లు నొప్పులు వస్తాయి. తలనొప్పిగా ఉంటుంది. శరీరంలో నీరు అంతా బయటకు పోతుంది కనుక డీ హైడ్రేషన్ వస్తుంది. నాలుక లోహపు రుచిని కలిగి ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన వస్తుంది. కానీ ఒకటి, రెండు రోజులు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. తరువాత పోతాయి. ఈ దశ దాటితే ఇక మీ శరీరం కొవ్వును ఇంధనంగా వాడుకోవడం మొదలు పెట్టింది. దీంతో ఈ దశ తరువాత శరీరంలో కొవ్వు కరగడం మొదలవుతుంది. ఈ దశ ఎంటర్ అయ్యాక వారం లోపే శరీర బరువులో చెప్పుకోదగిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
కీటోజెనిక్ డైట్‌ను 21 రోజుల పాటు పాటిస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్నవారు అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఈ డైట్‌ను పాటించాలి. అయితే వైద్యుల సలహా మేరకు ఈ డైట్‌ను పాటిస్తే మంచిది. లేదంటే కిడ్నీల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కీటోజెనిక్ డైట్ వల్ల లాభాలు
* కీటోజెనిక్ డైట్‌ను పాటించడం వల్ల నడుం చుట్టుకొలత భారీగా తగ్గుతుంది. అధిక బరువును తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు.
* డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి.
* చర్మ సమస్యలు ఉండవు.
* క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
* గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* మహిళలు పీసీవోఎస్ సమస్య నుంచి బయట పడవచ్చు.