Categories: Featured

మహిళల్లో తరచూ వచ్చే విటమిన్ల లోపాల సమస్యలు..!

మన శరీరానికి పోషణను అందించడంలో విటమిన్లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది నిత్యం పౌష్టికాహారం తీసుకోరు. ముఖ్యంగా మహిళలు పోషకాహార లోపం బారిన పడుతుంటారు. అయితే మహిళల్లో సాధారణంగా కనిపించే విటమిన్ల లోపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

vitamin deficiencies that occur in women

1. మహిళలకు విటమిన్‌ ఎ చాలా అవసరం. లేదంటే వారిలో కళ్లు పొడిబారడం, దురదలు రావడం సంభవిస్తాయి. లోపం తీవ్రతరం అయితే అంధత్వం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక విటమిన్‌ ఎ ఉండే ఆహారాలను మహిళలు తరచూ తీసుకోవాలి.

2. మహిళలకు విటమిన్‌ డి కూడా ఎంతో అవసరం. విటమిన్‌ డి లోపిస్తే ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముకల సంబంధ వ్యాధులు వస్తాయి. అలాగే పీసీవోఎస్‌ సమస్య వస్తుంది. విటమిన్‌ డిని తగిన మోతాదులో తీసుకుంటే స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉంటుంది. అలాగే గర్భధారణ సమయంలో సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో అబార్షన్‌ వంటివి జరగకుండా ఉంటాయి. అలాగే విటమిన్‌ డి వల్ల పిండం ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.

3. విటమిన్‌ ఇ చక్కని యాంటీ ఆక్సిడెంట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది సెలీనియంతో కలిసి కణాల పొరలను దెబ్బ తినకుండా చూస్తుంది. ఈ విటమిన్‌ లోపిస్తే రక్తహీనత సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వెన్నెముక, కంటి సమస్యలు వస్తాయి. కనుక విటమిన్‌ ఇ ఉండే ఆహారాలను కూడా మహిళలు తరచూ తీసుకోవాల్సి ఉంటుంది.

4. మహిళలకు విటమిన్‌ కె కూడా చాలా అవసరం. ఇది లోపిస్తే రక్తస్రావం అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్‌ కె ఉండే ఆహారాలను తీసుకోవాలి.

5. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి వారు విటమిన్‌ ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే చిగుళ్ల సమస్యలు, గాయాలు, జ్వరం, ఇన్‌ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి.

6. రైబోఫ్లేవిన్‌ విటమిన్‌ లోపిస్తే పెదవులు, నోరు పగులుతాయి. నాలుక వాపుకు గురై ఎర్రగా కనిపిస్తుంది. కనుక ఈ విటమిన్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను రోజూ పాలను తాగితే చాలు. రైబోఫ్లేవిన్‌ సమృద్ధిగా లభిస్తుంది.

7. నియాసిన్‌ లోపిస్తే పెల్లాగ్రా, డయేరియా, దెమెన్షియా, డర్మటైటిస్‌ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని కూడా తరచూ అందేలా చూసుకోవాలి. పల్లీలు, పప్పు దినుసులు, తృణ ధాన్యాల్లో ఈ విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది.

8. మహిళలకు కావల్సిన విటమిన్లలో పైరిడాక్సిన్‌ కూడా ఒకటి. ఇది విత్తనాలు, మాంసం, తృణ ధాన్యాల్లో లభిస్తుంది. దీని వల్ల శరీరంలో ప్రోటీన్లు సరిగ్గా జీర్ణమవుతాయి.

9. మహిళలకు పాంటోథెనిక్‌ యాసిడ్‌ కూడా అవసరమే. ఇది మెటబాలిక్‌ ప్రక్రియలను సరిగ్గా నిర్వర్తించేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొవ్వుల మెటబాలిజంకు పనిచేస్తుంది. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల్లో ఈ విటమిన్‌ ఉంటుంది.

10. ఆకుపచ్చని కూరగాయలు, పప్పు దినుసుల్లో ఫొలేట్‌ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ ఏర్పడేందుకు అవసరం అవుతుంది. దీంతోపాటు మహిళలల్లో వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. గర్భిణీల్లో పిండం ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అబార్షన్లు అవకుండా ఉంటాయి.

11. విటమిన్‌ బి12 మాంసం తినడం వల్ల లభిస్తుంది. ఇది లోపిస్తే న్యూరైటిస్‌ సమస్య వస్తుంది. నోరు, నాలుక పగులుతాయి. నాడీ మండల సమస్యలు వస్తాయి. రక్తహీనత సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు ఈ విటమిన్‌ను కూడా అందేలా చూసుకోవాలి.

ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మహిళలు తమకు ఏ విటమిన్‌ లోపం ఉందో తెలుసుకోవచ్చు. దీంతో ఆ విటమిన్ల తాలూకు ఆహారాలను తీసుకుంటే వాటి లోపం ఏర్పడకుండా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts