ఖర్జూరాలను తినడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. క్యాలరీలు అధికంగా ఉంటాయి. అలాగే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాల వ్యాధులు రాకుండా చూస్తాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.
అయితే ఖర్జూరాల్లో చక్కెర, ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని ఏ సమయంలో తింటే మంచిది ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని తినాలా, నేరుగా తినాలా, లేదా రాత్రి నిద్రించడానికి ముందు తినాలా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఖర్జూరాలను ఏయే సమయాలలో తినాలి, ఎప్పుడు తింటే ప్రయోజనాలు కలుగుతాయి, ఎప్పుడు తినకూడదు.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరాల్లో చక్కెర శాతం ఎక్కువగానే ఉంటుంది. కానీ అది సహజసిద్ధమైన చక్కెర. కనుక వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. కనుక వ్యాయామం చేయడానికి 30-60 నిమిషాల ముందు 2 నుంచి 4 ఖర్జూరాలను తినవచ్చు. దీంతో శరీరానికి స్థిరంగా శక్తి అందుతుంది. ఫలితంగా వ్యాయామం ఎక్కువ సేపు చేసినా అలసట రాకుండా ఉంటుంది.
ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకోవచ్చు. ఫలితంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. అందువల్ల వీటిని రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు కూడా తినవచ్చు.
అయితే ఉదయాన్నే పరగడుపునే ఖర్జూరాలను తింటేనే మనకు అధిక ప్రయోజనాలను కలుగుతాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరం లోపల పలు భాగాలు శుభ్రమవుతాయి. గుండె, లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. ఇక ఖర్జూరాలను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, వెంట్రుకలను సంరక్షిస్తాయని కూడా తేలింది.
ఖర్జూరాల వల్ల అధిక బరువు తగ్గుతారు. మలబద్దకం ఉండదు. ఎముకలు దృఢంగా మారుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అల్జీమర్స్, క్యాన్సర్, ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. అందువల్ల వీటిని నిత్యం సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు.
ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపులను తగ్గిస్తాయి. వాటిలోని పాలీఫినాల్స్, ఇతర పోషకాలు, సమ్మేళనాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు ఖర్జూరాలను తింటే మంచిది.
భోజనం చేసిన వెంటనే ఖర్జూరాలను అస్సలు తినరాదు. తింటే వాటిల్లో ఉండే ఫైబర్ త్వరగా జీర్ణం కాదు. అందువల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే డయేరియా ఉన్నవారు ఆ సమస్య తగ్గేవరకు ఖర్జూరాలను తినరాదు. లేదంటే ఖర్జూరాల్లో ఉండే షుగర్ ఆల్కహాల్ సార్బిటాల్ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. కనుక విరేచనాలు అయ్యే వారు ఆ సమస్య నుంచి బయట పడేవరకు ఖర్జూరాలను తినరాదు. అలాగే ఫుడ్ అలర్జీలు, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) సమస్య ఉన్నవారు ఖర్జూరాలను తినరాదు. ఇక ఈ సమస్యలు ఉన్నవారు కాకుండా మిగిలిన ఎవరైనా సరే ఖర్జూరాలను నిత్యం తినవచ్చు. దీంతో పైన తెలిపిన విధంగా ప్రయోజనాలను పొందవచ్చు.