Aloo Chips : షాపుల్లో ల‌భించే విధంగా క‌ర‌క‌ర‌లాడేలా రుచి రావాలంటే.. ఆలు చిప్స్‌ను ఇలా చేయాలి..

Aloo Chips : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చిప్స్ ఒక‌టి. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లిసిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. హాట్ చిప్స్ షాపుల్లో, తినుబండారాల‌ను అమ్మే షాపుల్లో ఆలూ చిప్స్ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. అలాగే ప్యాకెట్ ల‌లో కూడా ఈ ఆలూ చిప్స్ మ‌న‌కు దొరుకుతాయి. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా క‌ర‌క‌రలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ చిప్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ చిప్స్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ చిప్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిప్స్ ఆలూ – అర కిలో, నీళ్లు – 75 ఎమ్ ఎల్, ఉప్పు – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిప‌డా.

Aloo Chips recipe in telugu make them crispy and crunchy
Aloo Chips

ఆలూ చిప్స్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేయాలి. త‌రువాత స్లైస‌ర్ స‌హాయంతో బంగాళాదుంప‌ల‌ను చిప్స్ ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా క‌ట్ చేసుకున్న చిప్స్ ను నీటిలో వేసి క‌డ‌గాలి. త‌రువాత వీటిని కాట‌న్ వ‌స్త్రంపై వేసుకోవాలి. త‌రువాత మ‌రో కాట‌న్ వ‌స్త్రంతో చిప్స్ పైన త‌డి పోయేలా తుడుచుకుని వీటిని 15 నుండి 20 నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు నీటిలో ఉప్పు వేసి క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆర‌బెట్టుకున్న చిప్స్ ను వేసి పెద్ద మంట‌పై వేయించాలి. వీటిని అటూ ఇటూ క‌దుపుతూ వేయించుకోవాలి. బంగాళాదుంప చిప్స్ స‌గం పైన వేగిన త‌రువాత 2 టీ స్పూన్ల క‌లిపి ఉంచిన ఉప్పు నీటిని చిప్స్ పైన వేసుకోవాలి.

చిప్స్ చ‌క్క‌గా వేగ‌గానే నూనెలో బుడ‌గ‌లు రావ‌డం త‌గ్గుతుంది. ఇలా వేగిన త‌రువాత చిప్స్ ను జ‌ల్లిగంటెలోకి తీసుకుని నూనె అంతా పోయే వ‌ర‌కు అలాగే ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత చిప్స్ ను గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారం చ‌ల్లుకుని క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ చిప్స్ త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ‌ చేసుకోవ‌డం వ‌ల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఆలూ చిప్స్ ను బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే మంచి నూనెలో త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts