Arati Puvvu Pesara Pappu Kura : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటి పండు మాత్రమే కాదు.. అరటి పువ్వు కూడా మనకు మేలు చేస్తుంది. అరటి చెట్లను ఇండ్లలో పెంచుకునేవారికి అరటి పువ్వు విరివిగా లభిస్తుంది. దీన్ని మార్కెట్లోనూ విక్రయిస్తారు. అయితే అరటి పువ్వును ఎలా వండాలో చాలా మందికి తెలియదు. దీన్ని పెసరపప్పుతో కలిపి వండవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక అరటి పువ్వు పెసర పప్పు కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పువ్వు, పెసర పప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
అరటి పువ్వు – ఒకటి (చిన్నది), పెసర పప్పు – పావు కప్పు (రెండు గంటలు నానబెట్టాలి), పసుపు – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, మెంతులు – అర టీస్పూన్, పచ్చి శనగ పప్పు – ఒక టీస్పూన్, మినప పప్పు – ఒక టీస్పూన్, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, పచ్చి మిర్చి – మూడు, అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి), కరివేపాకు – రెండు రెబ్బలు, మిరప కారం – పావు టీస్పూన్, నూనె – ఐదు టీస్పూన్లు, ఇంగువ – కొద్దిగా.
అరటి పువ్వు, పెసర పప్పు కూరను తయారు చేసే విధానం..
అరటి పువ్వును ముందుగా శుభ్రం చేసుకోవాలి. పైన ఉన్న తొక్కలు తీసి లోపల ఉన్న వాటిలో నుంచి మధ్య భాగంలో ఉండే కేసరం తీసేయాలి. శుభ్రం చేసిన అరటి పువ్వును మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు, తగినంత పసుపు వేసి బాగా కలిపి కచ్చా పచ్చాగా చేసుకున్న అరటి పువ్వును అందులో వేసి రెండు మూడు సార్లు బాగా కడగాలి. ఒక గిన్నెలో అరటి పువ్వుకు తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు జత చేసి, స్టవ్ మీద ఉంచి కొద్ది సేపు ఉడికించి చల్లారాక గట్టిగా పిండి నీళ్లు తీసేయాలి. స్టవ్ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి శనగ పప్పు, మినప పప్పు వేసి బాగా వేయించాక పసుపు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి. అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాక ఉడికించిన అరటి పువ్వు మిశ్రమం, నానబెట్టిన పెసర పప్పు వేసి బాగా కలిపి చివరగా కొద్దిగా ఉప్పు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. దీంతో రుచికరమైన అరటి పువ్వు పెసరపప్పు కూర తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. వేటితో తిన్నా భలే రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.