Bendakaya Pappu : బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెండకాయలతో ఎక్కువగా బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు, బెండకాయ టమాట వంటి కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండకాయలతో పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును జిగురు లేకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 150 గ్రా., తరిగిన బెండకాయలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5.
బెండకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పును తీసుకుని శుబ్రంగా కడగాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేయాలి. తరువాత కుక్కర్ పై మూతను ఉంచి మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి జిగురు అంతా పోయే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత వేయించిన బెండకాయ ముక్కలు, కారం వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఉడికించిన పప్పును, చింతపండు రసాన్ని, పావు గ్లాస్ నీటిని పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పప్పు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈపప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే వంటకాలతో పాటు బెండకాయలతో ఇలా పప్పును కూడా తయారు చేసుకుని తినవచ్చు.