Dahi Idli : ఉదయం చాలా మంది అనేక రకాల టిఫిన్లు చేస్తుంటారు. చాలా మంది చేసే టిఫిన్లలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీ ప్రియులు చాలా మందే ఉంటారు. ఇడ్లీలను రక రకాల టేస్ట్‌లతో ఆస్వాదిస్తుంటారు. కొందరు కారం పొడి నెయ్యితో తింటే కొందరు ఇడ్లీలను సాంబార్ తో తింటారు. ఇంకొందరు కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ, పుట్నాల చట్నీతో ఇడ్లీలను తింటుంటారు. అయితే మీరు దహీ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా.. అవును, మీరు విన్నది నిజమే. దహీ వడలాగే దహీ ఇడ్లీ కూడా ఉంటుంది. దీన్ని మీరు కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ ఇడ్లీ తయారు చేసేందుకు మీ ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలను ఉపయోగించవచ్చు. లేదా ఇడ్లీలను వండుకుని వాటితో కూడా మీరు దహీ ఇడ్లీలను తయారు చేయవచ్చు. ఇక వీటిని ఎలా చేయాలంటే.. ముందుగా ఒక గిన్నెలో కాస్త పెరుగు తీసుకుని అందులో చక్కెర, ఉప్పు తగినంత వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి లో-మీడియం హీట్‌పై ఉంచి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులోనే ఆవాలు, మినప పప్పు, ఎండు మిర్చి, కరివేపాకులు, చిటికెడు ఇంగువ వేసి బాగా వేయించాలి.
ఇలా చేయాలి..
ఇప్పుడు పోపు రెడీ అయ్యాక అంతకు ముందు సిద్ధం చేసుకున్న పెరుగులో వేసి కలపాలి. అనంతరం ఒక ప్లేట్ తీసుకుని మీకు కావల్సినన్ని ఇడ్లీలను ప్లేట్లో ఉంచి వాటిపై ముందుగా సిద్ధం చేసిన పెరుగు మిశ్రమాన్ని పోయాలి. తరువాత కొత్తిమీర ఆకులు, జీలకర్ర పొడి, కారం చల్లాలి. దీంతో దహీ ఇడ్లీ రెడీ అవుతుంది. అయితే వీటిని నేరుగా అలాగే తినవచ్చు. కానీ కొందరు ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక తింటారు. అలా కూడా తినవచ్చు. దీన్ని తయారు చేసేందుకు మీకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
ఇక ఇలా తయారు చేసిన దహీ ఇడ్లీ అచ్చం దహీ వడలాగే రుచి ఉంటుంది. కనుక ఇడ్లీ ప్రియులు ఈ కొత్త వంటకం టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు. అయితే మరి ఈ వంటకం ఆరోగ్యకరమైందేనా.. కచ్చితంగా ఆరోగ్యకరమైందేనని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా లైట్ ఫుడ్. అందువల్ల పొట్టపై భారం పడదు. సులభంగా జీర్ణమవుతుంది. పైగా ప్రోటీన్లు, క్యాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. అందువల్ల ఇడ్లీలను తినేవారు ఈసారి ఇలా దహీ ఇడ్లీలను తయారు చేసి తినండి. మీరు గనక ఒక్కసారి టేస్ట్ చేస్తే వీటి రుచిని జన్మలో మరిచిపోరు. అంతలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే వీటిని తయారు చేసి తినండి. రుచిని ఆస్వాదించండి.