Dil Pasand : మనకు బేకరీల్లో లభించే పదార్థాల్లో దిల్ పసంద్ కూడా ఒకటి. దిల్ పసంద్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని మనం ఇంట్లో తయారు చేసుకోరాదు అని అనుకంటూ ఉంటారు. కానీ బేకరీ స్టైల్ లో ఈ దిల్ పసంద్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ లో దిల్ పసంద్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్ పసంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, పంచదార పొడి – అర కప్పు, ఎండుకొబ్బరి తురుము – అర కప్పు, ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పు – పావు కప్పు, టూటీ ఫ్రూటీ – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, వంటసోడా – పావు టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
దిల్ పసంద్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత దానిలో ఉప్పు, వంటసోడా, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తరువాత మరో గిన్నెలో ఎండు కొబ్బరి తురుము, టూటీ ఫ్రూటీ, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి. తరువాత ఒక భాగాన్ని తీసుకుని పొడి పిండి వేసుకుంటూ మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి.
తరువాత దానిపై ఎండు కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. తరువాత అంచులనను ఒక దగ్గరికి తెచ్చి మూసివేయాలి. దీనిని ముందుగా చేత్తో సమానంగా వత్తుకున్న తరువాత చపాతీ కర్రతో ఒకటిన్నర ఇంచు మందం ఉండేలా అంతా సమానంగా వచ్చేలా వత్తుకోవాలి. తరువాత దీనిపై బటర్ ను కానీ, పాలను కానీ రాయాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో స్టాండ్ ను ఉంచి దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఒక అల్యూమినియం ట్రేను తీసుకుని దానికి నూనె లేదా నెయ్యి రాసి అందులో ముందుగా తయారు చేసిన దిల్ పసంద్ ను ఉంచాలి. తరువాత ఈ గిన్నెను స్టాండ్ మీద ఉంచి 30 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేడి చేయాలి.
30 నిమిషాల తరువాత ఈ దిల్ పసంద్ ను మరో వైపుకు తిప్పుకుని మరలా 20 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా ఉడికించిన తరువాత ఈ దిల్ పసంద్ ను ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దిల్ పసంద్ తయారవుతుంది. దీనిని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా అప్పుడప్పుడూ ఈ దిల్ పసంద్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.