Dosakaya Pachadi : మనం కూరగాయలతో కూరలే కాకుండా వివిధ రకాల పచ్చళ్లుకూడా తయారు చేస్తూ ఉంటాము. ఇలా మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయలల్లో దోసకాయ కూడా ఒకటి. దోసకాయతో కూర, పులుసు, పప్పుతో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయపచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – అర టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 10 నుండి 15, తరిగిన టమాటాలు – 2, చింతపండు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెమ్మలు – 4, చిన్నగా తరిగిన దోసకాయ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – కొద్దిగా.
దోసకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నువ్వులు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి కలపాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మగ్గించాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత జార్ లో ముందుగా వేయించిన పల్లీలు, నువ్వులు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
తరువాత ఉడికించిన టమాట ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత దోసకాయ ముక్కల నుండి సగం దోసకాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత తాళింపు చేసి పచ్చడిలో కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.