Egg 65 : కోడిగుడ్లతో మనం అనేక రకాల కూరలను చేసుకుని తినవచ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒకటి. చికెన్ 65, ఫిష్ 65, మటన్ 65.. ఇలా అనేక రకాల వాటిని తయారు చేసినట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తినవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. మరి ఎగ్ 65 ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఎగ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 6, అల్లం – 2 ముక్కలు, వెల్లుల్లి – 6 నుంచి 10 రెబ్బలు, పచ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక కప్పు, కరివేపాకు – ఒక కప్పు, గరం మసాలా – 4 టీస్పూన్లు, కారం – తగినంత, కశ్మీరీ కారం పొడి (రంగు కోసం) – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, పెరుగు – 2 కప్పులు, చిల్లీ సాస్ – కొద్దిగా, జీలకర్ర పొడి – 2 లేదా 3 టీస్పూన్లు, చక్కెర – 2 టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 లేదా 2 కప్పులు.
ఎగ్ 65 తయారు చేసే విధానం..
కోడిగుడ్లను ఉడకబెట్టి వాటిల్లో ఉండే పచ్చసొన తీసేసి తెల్ల సొన మాత్రమే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలకు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, గరం మసాలా, బ్రెడ్ ప్రౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పెట్టుకోవాలి. రెండు కోడిగుడ్లను పగలగొట్టి వాటిల్లో నుంచి తెల్లసొన తీసి ఆ మిశ్రమంలో బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆ ఉండలను వేస్తూ వాటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి కాగానే అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరప కాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అనంతరం అందులో పెరుగు వేసి కొద్దిగా ఉడకగానే కశ్మీరీ కారం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, చిల్లీ సాస్ వేయాలి. చక్కెర వేస్తే రుచి బాగుంటుంది. తరువాత కొత్తిమీర వేయాలి. అనంతరం ముందుగా వేయించి పెట్టుకున్న ఉండలను వేయాలి. మంట కాస్త పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టేవరకు ప్యాన్‌ను అటు ఇటు తిప్పాలి. బాగా ఉడికింది అనుకుంటే.. వెంటనే దించేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఎగ్ 65 తయారవుతుంది. దీన్ని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.