చికెన్ రెసిపీల్లో అందరికీ నచ్చేది చికెన్ 65. దీనికున్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్నో రకాల రెసిపీలు వాటి తయారీ విధానం లేదా తయారీకి పురికొల్పిన విధానం బట్టి వాటి పేర్లు వస్తాయి. మరికొన్ని రెసిపీలైతే కొందరు సెలబ్రిటీలు లేదా ప్రముఖులు కాంబినేషన్‌గా తిన్న తీరు అనుసరించి వారి పేరు మీదుగా రెపిపీల పేర్లు రావడం జరిగింది. కానీ ఈ చికెన్ 65(Chicken 65)కి ఆ పేరు వచ్చిన తీరు తెలిస్తే విస్తుపోతారు. ఆ..! ఇలానా దానికి ఆ పేరు వచ్చింది అని నోరెళ్లబెడతారు. మరీ ఆ గమ్మత్తైన కథేంటో చదివేయండి మరీ.. గతేడాది ప్రముఖ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ వంటకాల జాబితా ఇచ్చింది. అందులో మన భారతదేశ వంటకం చికెన్ 65 మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతలా ఫేమస్ అయిన ఈ చికెన్ 65ని ఆ నెంబర్‌తో ఎందుకు పిలుస్తారనేది అతిపెద్ద డౌటు.
అందుకు గల రీజన్ కూడా తెలియదు. అయితే చాలామంది 65 చికెన్ ముక్కలతో చేస్తారేమో లేక అన్ని రోజులు లేదా గంటలు ఈ చికెన్‌ని మ్యారినైట్ చేస్తారేమో అంటూ..పలు వాదనలు కూడా వినిపించాయి. కానీ అవేమీ కారణం కాదట. అలా పిలిచేందుకు ఓ తమాషా కథ ఉంది. అదేంటంటే.. చాలమంది దీన్ని స్నాక్ రూపంలో తింటారు. కొందరు నాన్స్, చపాతీలు, భోజనంగానూ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టేస్టీ చికెన్ 65 పేరు రావడానికి కారణం చెన్నైలోని బుహారీ రెస్టారెంట్ అట. అక్కడ మద్రాస్ మాజీ షెరీఫ్ ఎ ఎం బుహారీ కొలంబోలో పాకశాస్త్రంపై ఇష్టంతో దానికి సంబంధించిన హోటల్‌మేనేజ్‌మెంట్ చదువుని పూర్తి చేసుకుని భారత్‌కి తిరిగి వచ్చాడు.
ఆ తర్వాత చెన్నైలో రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. నాటి బ్రిటిష్ వాళ్లకు భారతీయ ఆహారంతో కూడిన సరికొత్త భోజనాన్ని అందించింది ఆయనే. బుహరీ హోటల్ ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు విభిన్న రుచులను అందించాడు. నాటి రోజుల మెనూలో సుదీర్ఘ వెరైటీల జాబితా ఉన్న హోటల్‌గా ప్రసిద్ధి చెందింది ఈ హోటల్. అయితే మనకేది కావాలో ఆర్డర్ చేయడానికి ఒక సైనికుడు భాషా సమస్య కారణంగా ఆ మెనూలోని నెంబర్ ఆధారంగా ఆర్డర్ చేశాడంట. అతడు ఎప్పుడు 65 నెంబర్‌లో ఉన్న చికెన్ రెసిపీని ఇమ్మని చెప్పేవాడట. పైగా అది క్రంచీగా ఉండే చికెన్ అని చెప్పేవాడట. దీంతో మిగతా కస్టమర్లు కూడా అతడిలా ఆ నెంబర్‌లో ఉన్నచికెన్‌ని ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు.
చెప్పాలంటే ఆ మెనూలో 65వ నెంబర్‌లో ఉన్న చికెన్ ఆర్డర్‌లే ఎక్కువగా ఉండేవి. అలా క్రమేపి అది కాస్త చికెన్ 65గా స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆ రెసిపీకి చికెన్ 65 అని పేరొచ్చింది. కాలం గడిచేకొద్ది ఈ వంటకానికి ప్రజాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి రెస్టారెంట్‌లలో నువ్వానేనా అనే రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ చికెన్ 65కి ఉన్న క్రేజ్ మరే రెసిపీకి లేదని చెప్పొచ్చు.